ష్యూరిటీ ఇస్తే.. చెల్లించాల్సిందే..
ABN , Publish Date - May 27 , 2026 | 06:15 AM
తీసుకున్న వ్యక్తి రుణాన్ని చెల్లించకుంటే ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణం తీసుకున్న వ్యక్తిపైనే మొదట చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఏదీ చిట్‌ఫండ్ చట్టంలో లేదని తెలిపింది.
రుణ గ్రహీత చెల్లించకుంటే పూచీదారుపై నేరుగా చర్యలు తీసుకోవచ్చు
రుణం పొందిన వ్యక్తిపైనే తొలుత చర్యలు తీసుకోవాలన్న నిబంధనేమీ లేదు: హైకోర్టు
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): తీసుకున్న వ్యక్తి రుణాన్ని చెల్లించకుంటే ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణం తీసుకున్న వ్యక్తిపైనే మొదట చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఏదీ చిట్‌ఫండ్ చట్టంలో లేదని తెలిపింది. ప్రస్తుత కేసులో ష్యూరిటీ ఇచ్చిన కె.వెంకట రామారావు జీతాన్ని జప్తు చేస్తూ గుంటూరు కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆయన దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కంబాల వెంకట రామారావు... కపిల్ చిట్ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్‌లో సభ్యుడిగా ఉన్న ఓ వ్యక్తికి ష్యూరిటీ ఉన్నారు. సదరు వ్యక్తి చిట్టీ బాకీ పడటంతో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ రికవరీ సర్టిఫికెట్ జారీ చేశారు. దాని ఆధారంగా గుంటూరు జూనియర్ సివిల్ కోర్టు వెంకట రామారావు జీతాన్ని జప్తు చేస్తూ 2025 అక్టోబరులో వారెంట్ జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రామారావు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రుణం తీసుకున్న వ్యక్తికి చెల్లింపు సామర్థ్యం ఉండి, అతను అందుబాటులో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా చిట్ కంపెనీ నేరుగా పూచీదారుపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 71, ఏపీ చిట్‌ఫండ్ రూల్స్‌లోని రూల్ 55 ప్రకారం రికవరీ సర్టిఫికెట్ రిజిస్ట్రార్ మాత్రమే జారీ చేయగలరన్నారు. ఆ అధికారం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌కు లేదన్నారు.
రికవరీ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ జీతాన్ని జప్తు చేయడానికి అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన వారెంట్ పూచీదారులకు నష్టం చేస్తుందన్నారు. సివిల్ రివిజన్ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. చిట్‌ఫండ్ కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రుణం తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఇచ్చిన వారికి బాధ్యత ఉంటుందన్నారు. రుణగ్రహీత అప్పు తీర్చనంత వరకు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి తన బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు. చిట్ ఫండ్ చట్టంలోని రిజిస్ట్రార్ నిర్వచనం కింద డిప్యూటీ రిజిస్ట్రార్ కూడా ఉన్నారని, ఈ నేపథ్యంలో రికవరీ సర్టిఫికెట్ జారీచేసే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. రికవరీ సర్టిఫికెట్ సివిల్ కోర్టు డిక్రీతో సమానమన్నారు. పూచీదారుగా ఉన్న పిటిషనర్ జీతాన్ని జప్తు చేస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన వారెంట్ సరైనదేనన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి... రామారావు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేశారు.