ఏఈల పదోన్నతిలో ‘సీనియార్టీ’ చెల్లదు
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:00 AM
రోడ్లు, భవనాలశాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ) పదోన్నతి విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 17 ఏళ్లనాటి వివాదానికి తెరదించింది.
రోస్టర్ పాయింట్ విధానాన్నే అనుసరించాలి
ఏఈఈల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాలశాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ) పదోన్నతి విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 17 ఏళ్లనాటి వివాదానికి తెరదించింది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసిన రోస్టర్ పాయింట్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియార్టీ నిబంధనను చేర్చడాన్ని తప్పుపట్టింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) పోస్టుకు పదోన్నతి కల్పించే దశలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్‌మెన్ కేటగిరీలను విలీనం చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రోస్టర్ పాయింట్ల విధానాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ విధానానికి సీనియార్టీ నిబంధన చేర్చడం వల్ల అసిస్టెంట్ ఇంజనీర్లు తమకు రావాల్సిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పదోన్నతులు కూడా కోల్పోతారని పేర్కొంది. జీవో 82ను రద్దు చేస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్(ఏపీఏటీ) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఏపీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
ఇదీ వివాదం
ఆర్‌అండ్‌బీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) పదవుల భర్తీ కోసం ఫీడర్ కేటగిరీలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), డ్రాఫ్ట్‌మెన్ మూడు వేర్వేరు విభాగాల నుంచి పదోన్నతి కల్పిస్తారు. దీనికిగాను సర్వీసు నిబంధనల్లో 24 పాయింట్ల రోస్టర్ పద్ధతిని రూపొందించారు. దీని ప్రకారం ప్రతి 24 ఖాళీల్లో ఏఈలకు 5 స్థానాలు, ఏఈఈలకు 18 స్థానాలు, డ్రాఫ్ట్‌మెన్‌కు 1 స్థానం కల్పించారు. అయితే, పదోన్నతుల విషయంలో రోస్టర్ పాయింట్ల పద్ధతికి తోడు సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2009లో జీవో 82 తీసుకొచ్చింది. ఈ జీవోను ఏఈలు పరిపాలన ట్రైబ్యునల్ ముందు సవాల్ చేయగా ఏపీఏటీ 2015లో సదరు జీవోను రద్దు చేసింది. దీనిపై ఏఈఈలు 2015, 2016లో హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఆ నిబంధన తగదు
‘‘పదోన్నతులకు సంబంధించి నిబంధనలు రూపొందించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అది ఓ వర్గం ఉద్యోగుల పట్ల వివక్ష చూపేదిగా ఉండకూడదు. డిప్యూటీ ఇంజనీర్ పోస్టుకు పదోన్నతి కల్పించే దశలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డ్రా ఫ్ట్‌మెన్ 3 వేర్వేరు కేటగిరీలను విలీనం చేయాల్సి ఉన్నందున రోస్టర్ పాయింట్ల పద్ధతిని తప్పుపట్టలేం. దీనికి అదనంగా సీనియార్టీ నిబంధన చేర్చడం వల్ల రోస్టర్ పాయిం ట్ విధానం దెబ్బతింటుంది. దీంతో తమకంటే సీనియర్లు అయిన ఇంజనీర్లందరికీ పదోన్నతులు లభించేవరకు ఏఈ లు వేచిచూడాలి. అసిస్టెంట్ ఇంజనీర్లకు కేటాయించిన 5 స్లాట్లు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో భర్తీ అయ్యే అవకాశముంది. ఒక ఫీడర్ కేటగిరీని సంతృప్తి పరిచేందుకు మరో ఫీడర్ కేటగిరీ పదోన్నతులను హరించేలా నిబంధన సరికాదు.’’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది.