ఆక్రమణదారులకు భూసేకరణ చట్టం వర్తించదు
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:46 AM
ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నప్పటికీ, అలాంటి ఆక్రమణదారులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లభించదని హైకోర్టు తేల్చిచెప్పింది.
చట్టబద్ధమైన పత్రాలు లేకుండా హక్కులు సంక్రమించవు
భూ యజమానులతో సమానంగా పరిహారం కోరలేరు
విజయవాడ ఆర్వోబీ భూసేకరణ కేసులో హైకోర్టు స్పష్టీకరణ
పిటిషనర్ల వ్యాజ్యాలు కొట్టివేత
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నప్పటికీ, అలాంటి ఆక్రమణదారులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లభించదని హైకోర్టు తేల్చిచెప్పింది. భూ యజమానులతో సమానంగా ఆక్రమణదారులు పరిహారం కోరలేరని స్పష్టం చేసింది. తమ ఆక్రమణలోని భూమి క్రమబద్ధీకరణకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా ఆ భూమిపై ఎటువంటి హక్కు సంక్రమించదని పేర్కొంది. 2013 భూసేకరణ చట్టం కేవలం చట్టబద్ధమైన యజమానుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిందని, వారి మాత్రమే పరిహారం కోరగలరని చెప్పింది. ఆ చట్టం ఆక్రమణదారుల కోసం కాదని స్పష్టం చేసింది. భూమిని కోల్పోయేవారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వారి స్థితిగతులు మెరుగుపర్చాలనే ఉద్దేశంతో చట్టం తీసుకొచ్చారని గుర్తుచేసింది. ప్రస్తుత కేసులో పిటిషనర్లు ఎవరూ కూడా తమ ఆధీనంలోని భూమికి యాజమాన్యహక్కు పత్రాలు కోర్టుకు సమర్పించలేదని తెలిపింది. మానవతా దృక్పథంతో 114 మంది నిర్వాసితులకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించారని గుర్తుచేసింది. విజయవాడలోని గుణదల ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం తమ ఆధీనంలోని భూములు తీసుకున్నందున 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2020, 2021, 2022లో పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను, అలాగే అధికారులపై వారు దాఖలుచేసిన కోర్టుధిక్కరణ పిటిషన్లను సైతం కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరనాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు.
పూర్వీకుల నుంచి ఆ భూమిలోనే జీవిస్తున్నామని, క్రమం తప్పకుండా ఆస్తి పన్నును చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అధికారులు కౌంటర్లు దాఖలు చేస్తూ.. రెవెన్యూ రికార్డుల్లో పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ పోరంబోకు, కాలువ, శ్మశానవాటికగా నిర్వచించారన్నారు. పిటిషనర్ల వద్ద ఎలాంటి యాజమాన్య హక్కు పత్రాలు లేవన్నారు. ఆస్తిపన్ను కట్టినంతమాత్రాన ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు సంక్రమించవని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు పిటిషనర్లు అర్హులు కాదంటూ వ్యాజ్యాలను కొట్టివేశారు.