మెడికల్ ప్రవేశాల జీవోతో నష్టమని బాధితులెవరూ రాలేదు
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:14 AM
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన జీవో 102ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
కౌన్సెలింగ్ ప్రక్రియలో మార్పులను తమ ముందుంచాలని వర్సిటీకి ఆదేశం
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన జీవో 102ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న వైద్య ఆరోగ్య, ఉన్నత విద్యా శాఖల ముఖ్యకార్యదర్శులు, డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, కాంపిటెంట్ అథారిటీ నీట్ యూజీ అడ్మిషన్స్‌లకు నోటీసులు జారీ చేసింది. త్వరలో కౌన్సెలింగ్ జరగనుందని, దానిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. జీవో కారణంగా నష్టపోతున్నామని బాధితులు ఎవరూ కోర్టు ముందుకు రాలేదని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తాజా జీవోతో కౌన్సెలింగ్ ప్రక్రియలో జరిగే మార్పులను సవివరంగా తమ ముందుంచాలని ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని సీట్లకూ కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి, ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ఈ ఏడాది జూలై 30న జారీ చేసిన జీవో 102ను సవాల్ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.మాధవి వాదనలు వినిపిస్తూ... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ విషయంలో 2020లో ప్రభుత్వం జీవో 151 తీసుకొచ్చిందన్నారు.
దీని ప్రకారం విద్యార్థులు ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉండేదన్నారు. తాజా జీవో 102తో ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు పెట్టుకొనేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ జీవో తీసుకొచ్చే ముందు ఎలాంటి అధ్యయనం జరగలేదన్నారు. దీంతో రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు ఓపెన్ క్యాటగిరీ సీట్లు పొందే అవకాశాలు కోల్పోతారని చెప్పారు. ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ తరఫు న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ... ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇవ్వడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని పలు వ్యాజ్యాలలో హైకోర్టు తప్పుపట్టిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అందుకు అంగీకరిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.