నామినేషన్ గడువు పెంచాలని ఆదేశించలేం
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:35 AM
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువును అదనంగా ఒకరోజు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే
వైసీపీ అనుబంధ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువును అదనంగా ఒకరోజు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగిసిందని, ఒకరోజు గడువు పెంచాలని ఆదేశిస్తే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుందని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రధాన అప్పీల్‌పై విచారణను 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. స్థానిక ఎన్నికల సందర్భంగా సాధారణంగా ఏర్పాటుచేసే నామినేషన్ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ అప్పిరెడి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్ అభ్యర్థనను సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. ఈ విషయంలో జిల్లాఎన్నికల అధికారిని ఆశ్రయించేందుకు అభ్యర్థులకు స్వేచ్ఛనిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఆదివారం ఈ అప్పీల్ విచారణకు రాగా అప్పిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. నామినేషన్ దాఖలుకు మరొకరోజు సమయాన్ని పొడిగించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ అభ్యర్థనను అంగీకరిస్తూ ఉత్తర్వులిస్తే ఎన్నికల షెడ్యూల్ మారిపోతుందన్నారు.