ఇది వలసవాద మనస్తత్వం!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:05 AM
పిల్లల సరరక్షణలో తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించిన అంశాల్లో జోక్యానికి భారతీయ కోర్టులు నిరాకరిస్తుంటాయని యూకేలోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఫ్యామిలీ డివిజన్) చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
యూకే కోర్టు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఫైర్
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): పిల్లల సరరక్షణలో తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించిన అంశాల్లో జోక్యానికి భారతీయ కోర్టులు నిరాకరిస్తుంటాయని యూకేలోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఫ్యామిలీ డివిజన్) చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది వలసవాద మనస్తత్వానికి నిదర్శనమని, భారతీయ న్యాయస్థానాలను తక్కువచేసేలా ఉన్నాయని ఆక్షేపించింది. ఇలాంటి వైఖరిని దేశంలో పునరుద్ధరించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. యూకే ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొంది. పిటిషన్ విచారణ చేసేనాటికి హైకోర్టులో హెబియస్ కార్పస్, గుంటూరు ఫ్యామిలీ కోర్టులో సంరక్షణ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నాయని తెలిసి కూడా ఆ కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదని పేర్కొంది. ‘ఆ కోర్టు భాష ఆధిపత్య మనస్తత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ఈ వలసవాద వారసత్వాన్ని భారత స్వతంత్ర న్యాయవ్యవస్థపై రుద్దడాన్ని అనుమతించం’ అని తేల్చిచెప్పింది. తన భార్య, ఆమె తల్లిదండ్రుల అక్రమ నిర్బంధంలో ఉన్న తన మైనర్ కుమార్తె(6)ను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలంటూ యూకేలో స్థిరపడిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యూకే ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను అనుసరించి బిడ్డను తనకు అప్పగించడంతో పాటు ఆమెను తిరిగి తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ సందర్భంగా ధర్మాసనం యూకే కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై అభ్యంతరం తెలిపింది. విదేశీ కోర్టుల ఆదేశాలు భారత్‌లో చెల్లవని.. హెబియస్ కార్పస్ పిటిషన్‌లో బిడ్డ సంరక్షణను నిర్ణయించే విషయంలో అసలు చెల్లవని తాజాగా స్పష్టంచేసింది.
ఈ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్‌కుమార్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ నెల 1న ఆదేశాలు జారీచేసింది. యూకే కోర్టు వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ఆ కోర్టు వాడినభాష మమ్మల్ని గాయపరిచేలా ఉందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించం.. దీనిని మరింత విశదీకరించడం అవసరమని భావిస్తున్నాం. బిడ్డను తన కస్టడీకి ఇవ్వాలని యూకేలో ఉన్న తండ్రి ఈ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాక.. బిడ్డ సంరక్షణ బాధ్యతను ఆయనకు అప్పగించాలని యూకే కోర్టు ఆదేశాలిచ్చింది. తల్లి కూడా గుంటూరు ఫ్యామిలీ కోర్టులో కస్టడీ ప్రొసీడింగ్స్ ప్రారంభించారు. తండ్రి దాఖలుచేసిన పిటిషన్‌లో ఈ హైకోర్టు పాత్ర విదేశీ కోర్టు ఉత్తర్వు అమలు చేయడం కాదు.. భారత్‌లో బిడ్డను తల్లి కస్టడీకి ఇవ్వడం చట్టవిరుద్ధమా.. బిడ్డ బాగోగులు కాపాడేందుకు కోర్టు జోక్యం అవసరమో కాదో నిర్ణయించడమే. పిల్లల సంరక్షణ వ్యవహారాల్లో జోక్యానికి భారతీయ న్యాయస్థానాలు నిరాకరిస్తుంటాయన్న యూకే కోర్టు వ్యాఖ్యలతో విభేదిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో విదేశీ కోర్టుల ఆదేశాలు భారతీయ కోర్టుల విచారణ ఫలితాన్ని ఆటోమేటిగ్గా నిర్ణయించజాలవు. విదేశీ కోర్టుల ఆదేశాలు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌లో బిడ్డ కస్టడీని నిర్ణయించే విషయంలో ఇచ్చే ఉత్తర్వులు మాకు శిరోధార్యం కాదు..’ అని తేల్చిచెప్పింది. తల్లి సంరక్షణలో బిడ్డ ఉండడం చట్టవిరుద్ధం కానేకాదని.. ఇలాంటి వ్యవహారాల్లో విదేశీ కోర్టు ఆదేశాలు అమలు చేయడం కంటే.. బిడ్డ సంక్షేమానికే భారతీయ కోర్టులు ప్రాధాన్యం ఇస్తాయని స్పష్టం చేసింది. ‘బిడ్డ భారత్‌లో ఉన్నంత కాలం భారతీయ చట్టాలే వర్తిస్తాయనేది నిర్వివాదాంశం. బిడ్డను తల్లి సంరక్షణకు ఇస్తూ జనవరి 8న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. తండ్రికి బిడ్డతో మాట్లాడేందుకు సంపూర్ణ హక్కు లున్నాయి. ప్రతిరోజూ వీడియో కాల్ చేసేందుకు అనుమతిస్తున్నాం. బిడ్డ మేజర్ అయ్యేవరకు తండ్రి ఏడాదికోసారి బిడ్డను ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తండ్రి తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ, బిడ్డ అమ్మమ్మ, తాతయ్య తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, తల్లి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.