Share News

వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ తరలింపుపై పిటిషన్‌ కొట్టివేత

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:18 AM

రాష్ట్ర వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను కర్నూలు నుంచి విజయవాడకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ తరలింపుపై పిటిషన్‌ కొట్టివేత

  • లోకాయుక్తను తరలించాలన్న పిల్‌పై విచారణ వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను కర్నూలు నుంచి విజయవాడకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. పిల్‌ బుధవారం విచారణకు రాగా... ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్‌.ప్రణతి వాదనలు వినిపించారు. వక్ఫ్‌ సంస్థలు, వాటి ఆస్తులు, ఆ ఆస్తుల వివాదాల కేసులు ఎక్కువగా కర్నూలు, ఆ చుట్టు పక్కల జిల్లాల్లోనే ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు కోర్టు ముందుంచారు. ట్రైబ్యునల్‌ను కర్నూలులోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం వక్ఫ్‌ సంస్థలకు చెందిన ఆస్తులు, కేసులు అత్యధికంగా కర్నూలులోనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో పిల్‌ను కొట్టివేస్తున్నామని ప్రకటించింది. మరోవైపు ఏపీ మానవ హక్కుల కమిషన్‌, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈ ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా ఎస్‌జీపీ ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ... కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పునరుద్ఘాటించారు. మానవ హక్కుల కమిషన్‌లో సిబ్బందికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య విభజన జరగాల్సి ఉందని నివేదించారు. లోకాయుక్త నియామకం త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 05:18 AM