మీ పిటిషన్‌కు విచారణార్హత లేదు!
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:57 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌కు..
ప్రశ్న రావణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. అరెస్ట్ చేశారు
రిమాండ్‌పై అభ్యంతరం ఉంటే సవాల్ చేసుకోవచ్చు
హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. జోసెఫ్‌పై గన్నవరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారని గుర్తుచేసింది. రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే.. వాటిని సవాల్ చేసుకోవచ్చని జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవైపు జైల్లో ఉన్నారని చెబుతూనే, హెబియస్ కార్పస్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ దశలో పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు అనుమతించాలని కోరారు. దీంతో వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అతనిని హైకోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి ఆర్చ్ బిషప్ డాక్టర్ చేగుడి అశోక్‌బాబు అలియాస్ జోషువా డేనియల్, పాత్రికేయుడు మేకల భానుమూర్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.