డీఎస్సీపై వైసీపీకి ‘మెగా’ షాక్
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:28 AM
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16వేల టీచరు పోస్టులను నింపిన కూటమి ప్రభుత్వంపై ఏదో సాధిద్దామని ప్రయత్నించిన వైసీపీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు నో
విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయ ప్రయోజనాల కోసం పిల్‌ను దుర్వినియోగం చేయడానికి వీల్లేదు
విలువైన ఆయుధమది.. వృథా తగదు
నష్టపోతే స్పోర్ట్స్ అభ్యర్థులు కోర్టుకు రారేం?.. భయపడుతున్నారనే వాదనతో మేం ఏకీభవించలేం
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలంటున్నారు
మరి వారిని ప్రతివాదులుగా చేర్చలేదేం?
బాధితులే ముందుకు రానప్పుడు ‘ప్రజాహితానికి’ అర్థం లేదు
వాదనలు కొనసాగిస్తారా? ఉపసంహరించుకుంటారా?
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం
భయంతో బాధితులు కోర్టును ఆశ్రయించలేదనే వాదన నమ్మశక్యంగా లేదు. కొందరు అభ్యర్థులు తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపణలు చేస్తున్నారు. మరి వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు? ప్రతి న్యాయవాదీ ముందుగా కోర్టు అధికారి, ఆ తరువాతే పిటిషనర్ తరఫు ప్రతినిధి. ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెట్టడం నిజమైతే, దానికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత పిటిషనర్‌పైనే ఉంది. బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
- హైకోర్టు
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16వేల టీచరు పోస్టులను నింపిన కూటమి ప్రభుత్వంపై ఏదో సాధిద్దామని ప్రయత్నించిన వైసీపీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఎస్సీ ప్రక్రియపై లేనిపోని అపోహలు సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని రాజకీయంగా అస్థిరపరచాలనే కుట్ర భగ్నమైంది. మెగా డీఎస్సీ-2025 పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టును వేదిక చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పిటిషనర్ తన వద్ద ఉన్న సమాచారంతో చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆశ్రయించారా అని ఆరా తీసింది.
స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపుపై అభ్యంతరం ఉంటే మొదట్లోనే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేవారని, ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ కోర్టు ముందుకు రాలేదని గుర్తుచేసింది. డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో కోర్టు కు రావడానికి అభ్యర్థులు భయపడుతున్నారన్న వాదనను తోసిపుచ్చింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సవాల్ చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు, మూడు పిల్స్ దాఖలయ్యాయని, అందులో 69 కేవలం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌పై నే దాఖలయ్యాయని.. భయాందోళన వాతావరణం ఉంటే అంతమంది హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది. అలాంటి పరిస్థితులు ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉంటుందని.. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు కదా అని ప్రశ్నించింది. డీఎస్సీ నోటిఫికేషన్, అభ్యర్థుల ఎంపిక, టీచర్ల నియామకానికి సంబంధించి పూర్తి సమాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉందని, వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. కొందరు అభ్యర్థులు తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. బాధితులే ముందుకు రానప్పుడు ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది. ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెడుతోందనడానికి సాక్ష్యాలను కోర్టు ముందుంచాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉందని గుర్తు చేసింది. పిల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని పిటిషనర్‌ను కోరింది. పిల్‌పై వాదనలు కొనసాగిస్తారా...లేక దానిని ఉపసంహరించుకుంటారా.. అనేది పిటిషనర్‌ను అడిగి తెలుసుకుని.. తమ ముందుకు రావాలని సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్‌కు సూచించింది. ఈ దశలో ప్రతివాదులకు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్పోర్ట్స్ కోటాతో రాష్ట్రానికేం సంబంధం: బెంచ్
మెగా డీఎస్సీలో టీచర్ల నియామక ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘‘దశాబ్దాలుగా అమల్లో ఉన్న రెండు శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్, ప్రవేశపరీక్ష అర్హత నిబంధనలను మారుస్తూ, 2014 డిసెంబరు, ఏప్రిల్ 2025లో జీవోలు ఇచ్చారు. ముందస్తుగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా కింద లబ్ధి చేకూర్చేందుకు నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు అర్హత పరీక్షను మినహాయిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. ఈ జీవోలపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బాధిత అభ్యర్థులు భయాందోళనలో ఉన్నందున ప్రజాప్రతినిధిగా వారి తరఫున పిల్ దాఖలు చేశాను. ఒకే ఏజెన్సీకి ప్రశ్నపత్రం, తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వల్ల గోప్యత దెబ్బ తింది. అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రచురించలేదు. పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ అభ్యర్థికి కృష్ణాజిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చింది. వివాదం కాగానే, ఈ అభ్యర్థి పేరును ఎంపిక జాబితా నుంచితొలగించారు. స్పోర్ట్స్ కోటాలో నియామకాలపై వార్తలు ప్రచురిస్తే క్రిమినల్, సివిల్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు ముందు ఉంచుతాం. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి’’ అని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘‘అభ్యర్థుల ఎంపిక, నియామకాల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కనీసం ఆ సమాచారం పరిశీలించకుండానే, పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది.
దాదాపు 45 పిటిషన్లలో అభ్యర్థులను కమిటీని ఆశ్రయించాలని ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ్రీవెన్స్ కమిటీ సమస్యలను పరిష్కరించి, రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని పిటిషన్లు ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అభ్యర్థి సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ సరైనదా....కాదా....అని నిర్థారించుకొనేందుకు ఆన్‌లైన్‌లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇప్పటికే రెండు పిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పిటిషనర్లు వివిధ రిట్ పిటిషన్ల ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపఽథ్యంలో ఓ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిల్‌కు విచారణార్హత ఉండదు’’ అని నివేదించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్‌కు కొన్ని నిర్దేశాలు చేసింది. విచారణను వాయిదా వేసింది.