సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యమా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:33 AM
విశాఖపట్నం పోలీసుల తీరును మరోసారి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం (పీఎల్‌సీఎఫ్) పేరుతో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, పోలీస్ యూనిఫామ్‌లో కౌన్సిలింగ్ చేయడం అంటే బెదిరించడం కిందికే వస్తుందని పేర్కొంది.
ఆ అధికారం మీకెక్కడిది?
యూనిఫామ్‌తో కౌన్సిలింగ్ అంటే బెదిరించడమే
ఇలాంటివి అనుమతిస్తే భవిష్యత్తులో
సమాంతర కోర్టులు నడుపుతారేమో!
విశాఖ పోలీసుల తీరును ఆక్షేపించిన హైకోర్టు
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోలీసుల తీరును మరోసారి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం (పీఎల్‌సీఎఫ్) పేరుతో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, పోలీస్ యూనిఫామ్‌లో కౌన్సిలింగ్ చేయడం అంటే బెదిరించడం కిందికే వస్తుందని పేర్కొంది. ఇలాంటి చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో సమాంతర కోర్టులు నడిపే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ఫోరమ్ ముందుకు ఫిర్యాదులు వచ్చినప్పటికీ కౌన్సిలింగ్ పేరుతో సివిల్ వివాదాల్లో ఎవరికీ నోటీసులు ఇచ్చి పిలవొద్దని పోలీసులు, అధికారులను ఆదేశించింది. ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రీ లిటిగేషన్ ఫోరమ్ ఏర్పాటు చేశారు? వ్యక్తులకు నోటీసులు ఇచ్చి పిలిపించడానికి ఏ చట్టం అనుమతిస్తుంది? తదితర వివరాలతో సమగ్ర నివేదిక దాఖలు చేయాలని విశాఖ పోలీసులను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని తమను స్టేషన్లకు పిలిపిస్తున్నారంటూ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పీఎల్‌సీఎఫ్ చట్టబద్ధతను తేల్చేందుకు ఈ వ్యవహారాన్ని సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఫైలును సీజే ముందు రిజిస్ట్రీ ఉంచగా.. సుమోటో వ్యాజ్యం నమోదు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సుమోటో వ్యాజ్యం సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్ జీపీ ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. కౌన్సిలింగ్ పేరుతో సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం లేదని, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు ఇది ఒక వేదికలా వ్యవహరిస్తుందని చెప్పారు. అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తప్పుపట్టడంతో విజయవాడలో ప్రీ లిటిగేషన్ ఫోరమ్‌ను మూసివేశారన్నారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ పీఎల్‌సీఎఫ్ పేరుతో విశాఖలో నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. సివిల్ వివాదాలు పరిష్కరించేందుకు లీగల్ సర్వీసు అథారిటీలు ఉన్నాయని తెలిపారు.
ఆ డాక్యుమెంట్లను అప్పీల్‌దారులకు ఇవ్వండి
‘గ్రూప్-1 కేసు’లో జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను
ఆదేశించిన హైకోర్టు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టు 10, సెప్టెంబరు 7న సిట్ ఇచ్చిన నివేదికలతో జత చేసిన డాక్యుమెంట్లను అప్పీల్‌దారులకు ఇవ్వాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలను నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చిలో 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు, ఉద్యోగాలు పొందనివారు వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పూర్తి చేసి సిట్ తుది నివేదికను ఇచ్చింది. అయితే ఈ నివేదికకు జత చేసిన డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని కోరుతూ పలువురు అప్పీల్‌దారులు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.