Share News

వాక్చాతుర్యం పక్కనపెట్టండి!

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:55 AM

రాజధాని అమరావతి నిర్మాణం భూ సేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ పిల్‌ దాఖలు చేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వాక్చాతుర్యం పక్కనపెట్టండి!

  • చట్టాల ఆధారంగా వాదనలు వినిపించండి

  • కోర్టు రాజకీయ వేదిక కాదు

  • పొన్నవోలుకు హైకోర్టు ధర్మాసనం సూచన

  • అమరావతి భూసేకరణపై మరో ‘పిల్‌’

  • పిటిషనర్‌కు సంబంధమేమిటన్న ధర్మాసనం

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణం భూ సేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ పిల్‌ దాఖలు చేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ పై బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తం చేయాలి తప్ప... దీంతో పిటిషనర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించింది. పిటిషనర్‌ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలోని మూడు మండలాల పరిధిలో పలు గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన 57 ప్రాథమిక, తుది నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ నిడమర్రుకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. ‘‘భూసేకరణ విషయంలో పిల్‌ ఎందుకు? మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది?’’ అని హైకోర్టు సీజే జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. నోరులేని రైతుల పక్షాన పిల్‌ దాఖలు చేశామని పొన్నవోలు బదులిచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ‘‘ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టు ఆఫీసర్‌, నిజాయితీగా విచారణలో కోర్టుకు సహకరించండి. వాక్చాతుర్యాన్ని పక్కనపెట్టి చట్టాలు, నిబంధనల ఆధారంగా వాదనలు వినిపించండి’’ అని చెప్పింది.

ఇప్పటికే ఐదు పిటిషన్లు...

భూసేకరణ చట్టనిబంధనలు పాటించకుండా రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నవోలు నివేదించారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.... భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితులు ఇప్పటికే ఐదు పిటిషన్లు దాఖలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పిల్‌ను విచారించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారని ఏజీ చెబుతున్నారని, ఇక తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. చట్ట నిబంధనలపై మరోసారి అధ్యయనం చేసి పిల్‌ విచారణార్హతపై వాదనలు వినిపించాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Jul 23 , 2026 | 04:56 AM