Share News

చంద్రబాబుకు ఊరట!

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:30 AM

రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది.

చంద్రబాబుకు ఊరట!

  • రాజధాని అసైన్డ్‌ భూముల కేసును కొట్టివేసిన హైకోర్టు

  • నారాయణకూ ఉపశమనం

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో వారిపై సీఐడీ గతంలో నమోదు చేసిన కేసును కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. రాజధాని అసైన్డ్‌ భూముల విషయంలో అసైన్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసి పలు అక్రమాలు జరగడానికి కారణమయ్యారనే ఆరోపణలతో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పి.నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 2021 మార్చి 19న వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. అసైన్డ్‌ రైతులకు మేలు చేయాలన్న సదుద్దేశంతోనే జీవో 41 తీసుకొచ్చారని, ఈ ఉత్తర్వుల జారీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపారు. సీఐడీ అధికారులు వేరే కేసులో సేకరించిన వివరాలను ప్రస్తుత కేసుకు జత చేసి న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేశారని.. వేరే కేసులో ఉన్న ఆధారాలను ఈ కేసులోని నిందితులకు అన్వయించడానికి వీల్లేదని తెలిపారు. ‘జీవో జారీ చేసిన ఐదేళ్ల తర్వాత దానిని తప్పుబడుతూ దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడానికి బాధితులెవరూ నేరుగా ఫిర్యాదు చేయలేదు. జీవో 41 జారీలో ఎంతో మంది అధికారులకు ప్రమేయం ఉంది.


వారెవరినీ నిందితులుగా చేర్చలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జీవో 41ని పూర్తిగా రద్దు చేయలేదు. అందులోని ఒక్క క్లాజ్‌ను మాత్రమే సవరించారు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్థార్ధ్‌ దవే వాదనలు వినిపించారు. సీఐడీ డీజీ ప్రాథమిక విచారణ జరిపాకే కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారని.. కోర్టు స్టే విధించడంతో ప్రాథమిక దశలోనే దర్యాప్తు నిలిచిపోయిందని.. కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. ఫిర్యాదులో నిజం లేకుంటే మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ కింద కేసును మూసివేయవచ్చని..ఈ దశలో కేసును కొట్టివేయడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసింది. కేసును కొట్టివేస్తూ బుధవారం నిర్ణయం వెల్లడించింది.

Updated Date - Jul 16 , 2026 | 04:32 AM