సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:09 AM
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో నమోదైన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో నమోదైన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాకినాడ జిల్లా ఏళేశ్వరానికి చెందిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్(ఎ్‌సపీసీపీఈఆర్) జాయింట్ సెక్రటరీ దాడిశెట్టి వీరబాబు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. సాక్ష్యాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘ఘటనలో టాస్క్‌ఫోర్స్‌తో పాటు మొత్తం 12 మంది పోలీసులకు భాగస్వామ్యం ఉంది. చాలా మంది పోలీసులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ శాఖకు చెందిన అధికారులే కేసును దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ప్రతివాదులుగా చేర్చారు.