తెలుగుభాష అమలుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:09 AM
రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలలో తెలుగు భాష అమలుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలలో తెలుగు భాష అమలుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అధికార భాషా చట్టం-1966కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస్ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్ మంగళవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ప్రణతి వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వ జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో తెలుగును అమలు చేసే ప్రక్రియ సాగుతున్నదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తెలుగుభాష అమలుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.