దర్యాప్తు పూర్తి చేసి..ఏప్రిల్ 30న నివేదిక ఇవ్వండి!
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:11 AM
గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి, ఏప్రిల్ 30న నివేదిక సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని సిట్‌ను హైకోర్టు సోమవారం ఆదేశించింది.
గ్రూప్-1 మూల్యాంకనం కేసులో హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి, ఏప్రిల్ 30న నివేదిక సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని సిట్‌ను హైకోర్టు సోమవారం ఆదేశించింది. సిట్ ఏర్పాటైన తర్వాత దర్యాప్తు నిమిత్తం గత నెల రోజుల్లో తీసుకున్న చర్యలపై వేసిన అఫిడవిట్‌ను ధర్మాసనం పరిశీలించింది. దర్యాప్తు పూర్తికి గడువు పొడిగించాలని కోరుతూ సిట్ వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సిట్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. సిట్ పంపిన జవాబుపత్రాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వడం తమకు తీవ్ర భారమని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబోరేటరీ సమాచారం ఇచ్చిందన్నారు. సిట్ పంపిన జవాబుపత్రాల్లో 167 మాత్రమే ఉంచుకొని, 500 వెనక్కి పంపిందని తెలిపారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు సాధ్యం కాదని భా విస్తే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని, అప్పుడు దర్యాప్తును మరో సంస్థకు అప్పగిస్తామంది. ఏప్రిల్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.