Share News

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:54 AM

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో దశాబ్దాల తరబడి తక్కువ జీతంతో పనిచేయించుకుని క్రమబద్ధీకరణ నిరాకరించడం శ్రమ దోపిడీకి పాల్పడటమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

  • తెలుగుగంగ, వీఎంసీ ఉద్యోగుల పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • 2 నెలల్లో రెగ్యులరైజ్‌ చేయాలన్న ధర్మాసనం

  • కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి ఊరట

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో దశాబ్దాల తరబడి తక్కువ జీతంతో పనిచేయించుకుని క్రమబద్ధీకరణ నిరాకరించడం శ్రమ దోపిడీకి పాల్పడటమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకోవడాన్ని అనేక సందర్భాల్లో మేం గమనిస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వీరితో పూర్తికాలం పనిచేయించుకుంటూ రోజువారీ వేతన జీవులుగా ఉంచడం అన్యాయం. తమ సేవలను క్రమబద్ధీకరించాలని ఆ ఉద్యోగులు కోరినప్పుడల్లా అధికారులు సాకులు చెబుతున్నారు. ఈ వైఖరి సరికాదు. వారి వినతిని పరిశీలించేటప్పుడు ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించాలి. తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, టైపిస్టు తదితర కేడర్లలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న పిటిషనర్లు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌(వీఎంసీ)లో టైపిస్టులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, ఆఫీసు సబార్డినేట్లు, ట్రేసర్లు, వాచ్‌మెన్‌లు, డ్రైవర్లు తదితర సర్వీసులను 2నెలల్లో క్రమబద్ధీకరించాలి.’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడానికి నిరాకరిస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేసింది. తీర్పుకాపీ అందిన నాటి నుంచి రెండు నెలల్లో పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలని, వారికి అన్ని అనుబంధ ప్రయోజనాలను అందించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ సుబేంధుసామంతతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

Updated Date - Apr 05 , 2026 | 03:54 AM