Share News

సొమ్ము జమ చేసి లైసెన్స్‌ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:57 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును జమ చేసి.. మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్‌ క్యాటగిరీ షాపుల యాజమానులను హైకోర్టు ఆదేశించింది.

సొమ్ము జమ చేసి లైసెన్స్‌ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోండి

  • ఓపెన్‌ క్యాటగిరీ మద్యం షాపులకు ఆదేశం

  • లైసెన్స్‌ రెన్యువల్‌ ఫీజు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టీకరణ

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

అమరావతి, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును జమ చేసి.. మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్‌ క్యాటగిరీ షాపుల యాజమానులను హైకోర్టు ఆదేశించింది. అయితే, లైసెన్స్‌ రెన్యువల్‌ ఫీజు ఎంత అనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తే అదనంగా చెల్లించిన సొమ్మును భవిష్యత్తు లావాదేవీల్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌లో భాగంగా కల్లుగీత వర్గానికి కేటాయించిన షాపుల కంటే ఓపెన్‌ క్యాటగిరీ షాపులకు అధికంగా రెన్యువల్‌ ఫీజును విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ గుంటూరుకు చెందిన మద్యం దుకాణాల యజమానులు హైకోర్టు ను ఆశ్రయించారు. సంబంధిత జీవోలను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఓపెన్‌ క్యాటగిరీ షాపులకు, కల్లుగీత వర్గానికి రిజర్వ్‌ చేసిన షాపులకు రెన్యువల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఆర్‌ఈటీ) విధింపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏకరీతిగా ఉండాలన్నారు. కల్లుగీత వర్గానికి కేటాయించిన షాపులకు తక్కువ ఆర్‌ఈటీ నిర్ణయించడం ఓపెన్‌ క్యాటగిరీ షాపుల యజమానుల పట్ల వివక్ష చూపడమేనన్నారు. లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం వార్షిక ఆదాయంలో 38శాతాన్ని చెల్లించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఏ ప్రాతిపదికన 38శాతం నిర్ణయించారో తెలియడం లేదన్నారు. మద్యం షాపు లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 21 ఆఖరు తేదీగా నిర్ణయించారని పేర్కొన్నారు. రిజర్వ్డ్‌ షాపులతో సమానంగా ఓపెన్‌ క్యాటగిరీ షాపులకు ఫీజులు వసూలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత వ్యాజ్యంలో పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వస్తే మిగిలిన సొమ్ము చెల్లించేందుకు సిద్ధమన్నారు.


ఒత్తిడి చేయడం లేదు: ఏజీ

అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. మద్యం షాపు లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదన్నారు. రెన్యువల్‌ యజమానుల ఇష్టమన్నారు. రెన్యువల్‌ కోసం వార్షిక ఆదాయంలో 38శాతాన్ని చెల్లించాలని పిటిషనర్‌ పొరపాటు పడుతున్నారన్నారు. గతంలో చెల్లించిన లైసెన్స్‌ ఫీజులో కేవలం 38శాతం మాత్రమే రెన్యువల్‌ కోసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తం సొమ్ము చెల్లించేలా పిటిషనర్లను ఆదేశించాలని కోరారు. వ్యాజ్యంలో విజయం సాధిస్తే వ్యత్యాసం ఉన్న సొమ్మును వెనక్కి పొందే వెసులుబాటు పిటిషనర్లకు ఉంటుందన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును జమ చేసి మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్‌ క్యాటగిరీ షాపుల యాజమానులను ఆదేశించింది.

Updated Date - Sep 19 , 2026 | 05:57 AM