2 నెలల్లో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:56 AM
ఆహార భద్రత చట్టం అమలును పర్యవేక్షించేందుకు, చట్టంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల, చౌకధరల దుకాణాల స్థాయిలో విజిలెన్స్ కమిటీలను రెండునెలల్లో ఏర్పాటు చేసి..
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఆహార భద్రత చట్టం అమలును పర్యవేక్షించేందుకు, చట్టంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా, మండల, చౌకధరల దుకాణాల స్థాయిలో విజిలెన్స్ కమిటీలను రెండునెలల్లో ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిల్‌పై విచారణను మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 నిబంధనలకు అనుగుణంగా పథకాల అమలును పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల, చౌక ధరల దుకాణాల స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ఇటీవల విచారణకు రాగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 30న ప్రభుత్వం జీవో 8 జారీ చేసిందని కోర్టుకు నివేదించారు. జిల్లా, మండల, చౌకధరల దుకాణాల స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. ఈ వివరాలపై పిటిషనర్ తరఫు న్యాయవాది అరుణ్‌శౌరి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో ప్రక్రియను పూర్తిచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.