కమర్షియల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 24 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితం కావడంపై హైకోర్టు ఫుల్ బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వివాదాల ఆర్థిక పరిమితిపై నోటిఫికేషన్ ఇవ్వాలి
ప్రభుత్వానికి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు
అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కాగితాలకే పరిమితం కావడంపై హైకోర్టు ఫుల్ బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో ఇచ్చిన జీవో 609కి అనుగుణంగా కమర్షియల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018 మే 3న అమల్లోకి వచ్చిన వాణిజ్య కోర్టుల (సవరణ) చట్టంలోని సెక్షన్ 3(1ఏ)కి అనుగుణంగా కమర్షియల్ కోర్టుల ఏర్పాటు, ‘ఆర్థిక పరిమితి’ విషయంలో విచారణ పరిధిని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రూ.3లక్షల నుంచి రూ.50లక్షల మధ్య విలువ గల వివాదాలను పరిష్కరించేందు ప్రతి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్‌లో కమర్షియల్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు పరిపాలన కమిటీ 2019 మార్చిలో తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేసింది. నాలుగేళ్ల తరువాత 13 పాస్ట్‌ట్రాక్ కోర్టులను సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్‌లో కమర్షియల్ కోర్టులుగా మారుస్తూ 2023 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 609 కాగితాలకే పరిమితమైందని వ్యాఖ్యానించింది. జీవోకి అనుగుణంగా కమర్షియల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా రూ.50లక్షలకు పైబడిన ఆర్థిక వివాదాల పిటిషన్లను పరిష్కరించే అధికారాన్ని జిల్లా జడ్జి క్యాడర్ కోర్టులకు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. విస్తృత ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
మరో న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఈ తీర్పులోని కొన్ని అంశాలతో ఏకీభవిస్తూ... మరికొన్నిటితో విభేదించారు. విశాఖపట్నం, విజయవాడలోని వాణిజ్య ప్రత్యేక కోర్టులకు రూ.కోటి, అంతకంటే ఎక్కువ విలువైన వాణిజ్య వివాదాల పిటిషన్లు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు విచారించే పరిధి ఉంటుందని పేర్కొన్నారు. సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవరకు రూ.కోటి కంటే తక్కువ విలువగల వాణిజ్య వివాదాలను ఈ రెండు కోర్టుల్లో దాఖలు చేయడానికి వీల్లేదని తెలిపారు. వాటిని సంబంధిత సివిల్ కోర్టులో దాఖలు చేసుకోవచ్చని, అయితే అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌కు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి సివిల్ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే.. అవే కోర్టులు విచారణ జరపవచ్చని, చట్టం అమల్లోకి వచ్చాక దాఖలైన పిటిషన్లను ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌కు లోబడి ఆయా కోర్టులు విచారించవచ్చని జస్టిస్ తిల్హరి వివరించారు.
ఇదీ నేపథ్యం...
వాణిజ్య వివాదాల కోర్టుల ఏర్పాటు చట్టం 2015 ప్రకారం రూ.కోటి పైబడిన వివాదాలను మాత్రమే కమర్షియల్ కోర్టులు విచారించేవి. 2018లో ఈ విలువను రూ.3లక్షలకు తగ్గిస్తూ కేంద్రం చట్టానికి సవరణ చేసింది. రూ.3లక్షల నుంచి రూ.కోటి మధ్య విలువైన వివాదాలకు సంబంధించిన కేసులను సాధారణ సివిల్ కోర్టులు విచారించాలా? లేక కమర్షియల్ కోర్టులు విచారించాలా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో స్పష్టత కోసం ముగ్గురు న్యాయమూర్తులతో ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 18న తీర్పు ఇచ్చింది.