Share News

ఆ నిర్మాణాలు కూల్చివేయండి!

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:56 AM

విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం మండలం, కాపులుప్పాడ గ్రామ పరిధిలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ...

ఆ నిర్మాణాలు కూల్చివేయండి!

  • అనుమతులు లేకుండా ఏపీటీడీసీ చేపట్టిన నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం మండలం, కాపులుప్పాడ గ్రామ పరిధిలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ టూరిజమ్‌ కార్పోరేషన్‌(ఏపీటీడీసీ) చేపట్టిన కాంక్రీట్‌ నిర్మాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంస్థ చేపట్టిన నిర్మాణాల తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం జీవీఎంసీ కమిషనర్‌కు లేదన్న ఏపీటీడీసీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి వాదన తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. దేశంలో చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వర్తించవనే అపోహ నుంచి ఏపీటీడీసీ బయటకు రావాల్సిన అవసరం ఉందంది. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చట్టం మీకంటే పైన ఉంటుందనే సూక్తి ప్రస్తుత కాలానికి కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పింది. జీవీఎంసీ కమిషనర్‌ గతేడాది నవంబరు 19న జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వులను అమలుచేయాలని స్పష్టం చేసింది. తీర్పు ప్రతి అందిన మూడు వారాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఆ నిర్మాణాలను తొలగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం టౌన్‌ ఫిషర్‌ ఉమెన్‌ డ్రై ఫిష్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ కార్యదర్శి ఎరినెమ్మ 2018లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - Apr 24 , 2026 | 04:56 AM