Share News

‘బడులకు’ ప్రహరీ నిర్మించేలా ఆదేశించండి

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:10 AM

రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల చూట్టూ ప్రహరీ గోడలు నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

‘బడులకు’ ప్రహరీ నిర్మించేలా ఆదేశించండి

  • హైకోర్టులో పిల్‌... కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

  • కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రతివాదిగా చేర్చాలని స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల చూట్టూ ప్రహరీ గోడలు నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్‌, సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసాగిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భూములు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కల్పించడంతో పాటు విద్యార్ధుల భద్రత కోసం ప్రహరీగోడ నిర్మించేలా ఆదేశించాలని కోరుతూ హెల్ప్‌ ద పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి.అరుణ్‌ శౌరి వాదనలు వినిపించారు. విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జి.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ..పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రస్తుత పిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

Updated Date - Jun 16 , 2026 | 04:10 AM