దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:23 AM
ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఎ.భారతి నియామకం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది.
తుది తీర్పునకు లోబడే భారతి నియామకం ఉంటుందని స్పష్టీకరణ
విచారణ సెప్టెంబరు 29కి వాయిదా
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఎ.భారతి నియామకం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. ట్రైబ్యునల్ చైర్‌పర్సన్, రిజిస్ట్రార్ జనరల్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల హోదాను తగ్గించేందుకు వీలుకల్పిస్తూ తీసుకొచ్చిన దేవదాయచట్టంలోని సెక్షన్లను సవాల్ చేస్తూ వేసిన ప్రధాన వ్యాజ్యంతో ప్రస్తుత అనుబంధ పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది. చైర్‌పర్సన్ భారతికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల హోదాను తగ్గించేందుకు వీలుకల్పిస్తూ దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్ 164(2)ను తీసుకొచ్చారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ విజయవాడ కానూరుకు చెందిన రేచింతల వేమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అయితే భారతిని ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఈనెల 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో 435ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, జీవో అమలును నిలిపివేయాలని కోరుతూ తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలైంది.
అనుబంధ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సోమవారం లంచ్ మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 164(2)ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ వేసేందుకు దేవదాయశాఖ సమయం తీసుకుందన్నారు. పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉండగానే చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ జిల్లా జడ్జి భారతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. హైకోర్టును సంప్రదించకుండా నియామకం చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ట్రైబ్యునల్ చైర్‌పర్సన్ భారతిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించాలని కోరారు. దేవదాయశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌గా భారతి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఈ వివరాలు నమోదు చేసిన ధర్మాసనం.. భారతి నియామకం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.