Share News

ఆ వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదు

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:14 AM

ప్రైవేటు అసోసియేషన్లు, సొసైటీలకు సంబంధించిన పరిపాలన, ఎన్నికల వివాదాల విషయమై దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆ వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదు

  • ప్రైవేటు సొసైటీల ఎన్నికల వివాదాలపై హైకోర్టు

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు అసోసియేషన్లు, సొసైటీలకు సంబంధించిన పరిపాలన, ఎన్నికల వివాదాల విషయమై దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వ అధికారిని నియమించినప్పటికీ సదరు సొసైటీ ప్రైవేటు స్వభావం మారిపోదని తెలిపింది. ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల వివాదానికి సంబంధించి దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాలను కొట్టివేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న డి.మంజుల దేవి ఏపీ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్‌.. కర్నూలు జిల్లా యూనిట్‌ కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 2024 అక్టోబరు 26, 27 తేదీల్లో జరగాల్సిన రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడానికి ఆమె ప్రయత్నించగా ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో ఈ ఎన్నికలు చట్ట విరుద్ధమంటూ మంజుల దేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రభుత్వ సహకార శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అసోసియేషన్‌ పూర్తిగా ప్రైవేటు సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 12 ప్రకారం ప్రభుత్వ రంగం నిర్వచనం పరిధిలోకి రాదన్నారు. అసోసియేషన్‌ బైలాస్‌ ప్రకారం జిల్లా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మాత్రమే రాష్ట్ర జనరల్‌ బాడీలో ఓటర్లుగా ఉంటారని, జిల్లాలో ఓడిపోయిన మంజుల దేవికి రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉండదన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రజా ప్రయోజనాలు లేనప్పుడు ఆర్టికల్‌ 226 ప్రకారం దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత కేసులో నర్సుల అసోసియేషన్‌ తన సభ్యుల ప్రయోజనం కోసం పనిచేస్తుంది తప్ప ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదన్నారు. విజయవాడ జిల్లా సహకార అధికారి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు తప్ప చట్టబద్ధమైన విధులు నిర్వర్తించలేదని స్పష్టం చేశారు. వివాదం మొత్తం ప్రైవేటు సొసైటీ ఎన్నికలతో ముడిపడి ఉన్నందున జోక్యం చేసుకోలేమని వ్యాజ్యాలను కొట్టివేశారు.

Updated Date - Jun 05 , 2026 | 05:16 AM