Share News

నేతలు ఆ భాష మాట్లాడకూడదు హుందాగా ఉండాలి

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:44 AM

ప్రజాజీవితంలో ఉండే రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకూడదు. వారు వాడే భాష ఎవరినీ నొప్పించకుండా, వివాదాలకు తావులేకుండా హుందాగా ఉండాలి అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

నేతలు ఆ భాష మాట్లాడకూడదు హుందాగా ఉండాలి

  • అంబటి సతీమణి పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాజీవితంలో ఉండే రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకూడదు. వారు వాడే భాష ఎవరినీ నొప్పించకుండా, వివాదాలకు తావులేకుండా హుందాగా ఉండాలి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. శాంతి భద్రతలు కాపాడడం ఒక్కటే పోలీసుల విధి కాదని, సమాజంలో శాంతి,సామరస్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని పేర్కొంది. తమ ఇంటికి భద్రత కల్పించాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సతీమణి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాంబాబు సతీమణి వేసిన పిటిషన్‌ను కోర్టు హౌస్‌ మోషన్‌గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)ఎ్‌స.ప్రణతి, హోంశాఖ ప్రభుత్వ న్యాయవాది జయంతి, సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్‌ వాదనలు వినిపించారు. ‘‘ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద పరిస్థితి అదుపులో ఉంది. గుంపులుగా ఎవరూ రావడం లేదు. వైసీపీ నేతలు రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించి వస్తున్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనవరి 31న రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయనను అరెస్టు చేసిన తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది’’ అని వివరించారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ....ప్రజా జీవితంలో ఉండేవారు హుందాగా వ్యవహరించాల్సి అవసరం ఉందని తెలిపింది. రాత్రి వేళ మళ్లీ దాడులు జరగవచ్చని పిటిషనర్‌ ఆందోళన చెందుతున్న నేపధ్యంలో, నివాసం వద్ద కొందరు పోలీసులను మోహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? గుంటూరు ఎస్పీ నుంచి వివరాలు తెప్పించుకొని కోర్టు ముందు ఉంచండి’’ అంటూ ఆదేశించింది. కొద్దిసేపటి అనంతరం విచారణ తిరిగి ప్రారంభమైన వెంటనే...ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ, 15మంది పోలీసులతో పిటిషనర్‌ నివాసం వద్ద పికెట్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం అక్కడ గుంపులుగా ఎవరూ లేరని తెలిపారు.


పిటిషన్‌పై విచారణను మూసివేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వై. లక్ష్మణరావు వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. భద్రత కల్పించే విషయంలో ఎస్పీకి తగిన సూచనలు చేయాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన నేపధ్యంలో, గుంటూరులోని అంబటి నివాసం, కార్యాలయంపై పలువురు దాడికి పాల్పడ్డారు. తమ ఇంటి వద్ద భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాంబాబు సతీమణి విజయలక్ష్మి ఆదివారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘అంబటి రాంబాబు నివాసంపై దాడులకు పాల్పడినవారిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ప్రతి గంటకూ గుంపులుగా జనం వస్తున్నారు. ఇంటి వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించండి’’ అని ఆయన వాదించారు.

Updated Date - Feb 02 , 2026 | 04:44 AM