హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు భద్రత కట్టుదిట్టం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:13 AM
హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు.
వీవీఐపీ, వీఐపీ నివాసాల వద్ద 24 గంటలూ సిబ్బంది మోహరింపు
ఉన్నతస్థాయి అంతర్గత సమీక్షలో రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
గుంటూరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. వీవీఐపీ, వీఐపీ నివాసాల వద్ద 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించాలన్నారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, అంతర్గత రహదారులు, పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం తుళ్లూరు మండలం నేలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద భద్రతా ఏర్పాట్లపై వెలగపూడిలోని నూతన డీఎస్పీ కార్యాలయంలో ఉన్నతస్థాయి అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రిపాఠి మాట్లాడారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు చేపట్టవలసిన చర్యలపై మార్గదర్శకాలు అందించారు. సందర్శకుల ప్రవేశానికి కట్టుదిట్టమైన యాక్సెస్ కంట్రోల్, వెరిఫికేషన్ విధానాలు అమలు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల నిర్వహణకు ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వీవీఐపీ, వీఐపీ రూట్లలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రత్యేక కార్యాచర ణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం తో పాటు కంట్రోల్‌రూమ్‌తో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఉన్నతాధికారులు
సమావేశం అనంతరం జిల్లా పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్, భద్రతా విభాగం, ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్మాణంలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలను, శాశ్వత హైకోర్టు భవనాలను సందర్శించారు. అక్కడ నిర్మాణ పనులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భవనాల నిర్మాణ పురోగతి, భద్రతా మౌలిక సదుపాయాల ఏర్పాటు, భవిష్యత్తు భద్రతా అవసరాలు, సిబ్బంది మోహరింపు తదితర అంశాలను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. సమావేశానికి ఐఎ్‌సడబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎస్పీఎఫ్ ఎస్పీ ఎం.శంకరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.