Share News

జస్టిస్‌ గన్నమనేనికి హైకోర్టు ఘన వీడ్కోలు

ABN , Publish Date - May 09 , 2026 | 04:20 AM

న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 27తో జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ పదవీ కాలం ముగియనుండగా..

జస్టిస్‌ గన్నమనేనికి హైకోర్టు ఘన వీడ్కోలు

  • న్యాయ సేవలను కొనియాడిన చీఫ్‌ జస్టిస్‌ లీసాగిల్‌

  • 27న పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 27తో జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ పదవీ కాలం ముగియనుండగా, కోర్టుకు వేసవి సెలవుల నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ లీసాగిల్‌ మాట్లాడుతూ... జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ న్యాయవ్యవస్థకు విశిష్ఠ సేవలు అందించారని, చట్టబద్ధమైన పాలనను కాపాడేందుకు ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడారు. జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ గొప్ప మానవతావాదని కొనియాడారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌కు మంచి ప్రాక్టీస్‌ ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చారన్నారు. జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, ప్రజా సేవకులని గుర్తు చేశారు. ‘రాజకీయ నాయకులు ప్రతి ఐదేళ్లకోసారి పరీక్షను ఎదుర్కొంటారు. న్యాయమూర్తులకు ఆ పరీక్ష ఉండదు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకానికి న్యాయమూర్తులు మరింత జవాబుదారీగా ఉండాలి. న్యాయమూర్తి తన విధి నిర్వహణలో భయం, పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆ ప్రమాణానికి విఘాతం కలగకుండా పనిచేశాననే సంతృప్తితో వెళ్తున్నాను. ఏపీ హైకోర్టులో ఉన్న న్యాయవాదుల్లో ఎంతో సామర్థ్యం ఉందని, అయితే, యువ న్యాయవాదులకు సరైన మార్గదర్శకత్వం అవసరం’ అని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు, జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు.


ఘన సన్మానం

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌, సుమిత్ర దంపతులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. పూలమాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, ఉపాధ్యక్షుడు పీటారామన్‌, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్‌, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 04:21 AM