Share News

సిట్‌కు మరో రెండు నెలల గడువు

ABN , Publish Date - May 01 , 2026 | 04:14 AM

గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేందుకు ప్రత్యేక పోలీసు బృందానికి ...

సిట్‌కు మరో రెండు నెలల గడువు

  • గ్రూపు- 1 అక్రమాల కేసులో హైకోర్టు ఆదేశం

  • ఇదే చివరి గడువు.. పొడిగింపు ఉండదని స్పష్టీకరణ

  • దర్యాప్తు ఇలాగేనా?..గోప్యత అక్కర్లేదా అని ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించేందుకు ప్రత్యేక పోలీసు బృందానికి (సిట్‌) హైకోర్టు మరో రెండునెలల సమయం ఇచ్చింది. మరోమారు గడువు పొడిగించబోమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్‌ 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పీళ్లపై విచారణలో సిట్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘‘దర్యాప్తు పురోగతిపై వివరాలను కోర్టు ముందు ఉంచాం. ఫైనల్‌ రిపోర్ట్‌ వేసేందుకు మరో రెండునెలల గడువు కావాలి.’’ అని అభ్యర్ధించారు. ధర్మాసనం స్పందిస్తూ... దర్యాప్తులో గుర్తించిన వివరాలను గోప్యంగా ఉంచకుండా కోర్టు ముందు ఎలా పెడతారని సిట్‌ను ప్రశ్నించింది. కేసు దర్యాప్తు చేసేది ఇలాగేనా అని నిలదీసింది. కోర్టు ఆదేశాలతో సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఇతర అధికారులు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ధర్మాసనం ముందు హాజరయ్యారు. ధర్మాసనం వారితో మాట్లాడింది. అధికారులు చెబుతున్న కారణాలతో సంతృప్తి చెందామని, గడువు పెంచుతున్నామని ప్రకటించింది.

Updated Date - May 01 , 2026 | 04:14 AM