Share News

పోలీసుల దర్యాప్తునకు సహకరించండి

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:56 AM

రాజధాని రైతులతో ఘర్షణకు దిగడంతో పాటు వారిని అసభ్య పదజాలంతో దూషించడంపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని మాజీ మంత్రులు పేర్ని నాని..

పోలీసుల దర్యాప్తునకు సహకరించండి

  • పేర్ని, అంబటి, ఇతర వైసీపీ నేతలకు హైకోర్టు ఆదేశం

  • నిందితులకు నోటీసులిచ్చి వివరణ తీసుకోండి

  • తాడేపల్లి పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులతో ఘర్షణకు దిగడంతో పాటు వారిని అసభ్య పదజాలంతో దూషించడంపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, వనమా బాల వజ్రబాబు, మేకా వెంకట శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర రెడ్డి, ఏఎన్‌ఎన్‌ మూర్తిలను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లపై నమోదైన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని, కాబట్టి బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్లను పరిష్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని అమరావతిలో అలజడి సృష్టించేందుకు సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ ముసుగులో పెనుమాక గ్రామానికి బయల్దేరిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను రాజధాని ప్రాంత రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తమపై దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు వైసీపీ నేతలపై బీఎన్‌ఎస్‌తో పాటు ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 09 , 2026 | 03:56 AM