అంబటికి నోటీసులివ్వండి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:47 AM
గతేడాది నమోదైన రెండు కేసులలో వైసీపీ నేత అంబటి రాంబాబుకు బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
సెక్షన్ 35(3) ప్రకారం వివరణ తీసుకోండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం
గతేడాది గుంటూరులో రెండు కేసులు నమోదు
బైక్ ర్యాలీలో ఇన్‌స్పెక్టర్‌పై దుర్భాషణలు
చంపేస్తామని కార్మిక నాయకుడికి బెదిరింపులు
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలోనూ 33 కేసుల్లో నోటీసులివ్వాలని కోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): గతేడాది నమోదైన రెండు కేసులలో వైసీపీ నేత అంబటి రాంబాబుకు బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తమ ముందున్న రెండు కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. వ్యాజ్యాలపై తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వెన్నుపోటు దినం పేరుతో అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అడ్డుకున్న ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి, దుర్భాషలాడారంటూ ఎస్‌ఐ నక్కా నరహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది జూన్ 4న గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని బజరంగ్ జూట్ మిల్ భూములకు సంబంధించి యాజమాన్యం, కార్మికుల మధ్య జరుగుతున్న వివాదంపై తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, కులం పేరుతో దూషించారని పేర్కొంటూ కార్మిక నాయకుడు పిల్లి బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2025లో గుంటూరు నగరంపాలెం పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ 33 కేసుల్లోనూ నోటీసులివ్వండి
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన మొత్తం 33 కేసులను కొట్టివేయాలని కోరుతూ అంబటి రాంబాబు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను కోర్టు లంచ్‌మోషన్లుగా విచారణకు స్వీకరించింది. రాంబాబు తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును ప్రధాన కేసుగా పరిగణించి, సీఆర్‌పీసీ సెక్షన్ 162 ప్రకారం మిగిలిన కేసులను వాంగ్మూలాలుగా నమోదు చేసేలా ఐవోలకు సూచనలు చేస్తామన్నారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి... ఈ 33 కేసుల్లో రాంబాబుకు బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. వ్యాజ్యంపై తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు.
మాపై నమోదైన కేసులు కొట్టివేయండి!
హైకోర్టును ఆశ్రయించిన జోగి, కాకాణి
వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌ఐ రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఈనెల 6న తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత జోగి రమేశ్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే బాలిక అత్యాచారానికి గురై మృతిచెందిన వ్యవహారంపై ప్రభుత్వాన్ని విమర్శించానంటూ నెల్లూరు టూటౌన్ టీడీపీ అధ్యక్షుడు మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8న నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మరో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ వేశారు.