నాలా బకాయిలపై ఉన్నతస్థాయి కమిటీ!
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:41 AM
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ట్యాక్స్ వసూలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేయండి
సీఎ్‌సకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ట్యాక్స్ వసూలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక్క విజయవాడ నార్త్ జోన్‌లోనే రూ.167 కోట్ల బకాయిలు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బకాయిల వసూలుకు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని ఆదేశించింది. విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడలోని గుణదల పరిధిలో ఉన్న కార్మెల్ నగర్ సర్వేనెం 150/2లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన 90 ఫ్లాట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యకుడు ఎన్.సత్యనారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం(పిల్)పై విచారణలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.