ఆ లెక్చరర్లను ఉన్న చోటే కొనసాగించండి!
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:35 AM
రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు హైకోర్టులో ఊరట లభించింది. కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రస్తుతం వారు...
ప్రభుత్వం, ప్రిన్సిపాళ్లకు హైకోర్టు ఆదేశం
కొత్త అభ్యర్థులను నియమించేటప్పుడు ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాలి
పిటిషనర్లకు న్యాయస్థానం స్పష్టీకరణ
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు హైకోర్టులో ఊరట లభించింది. కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రస్తుతం వారు పనిచేస్తున్న మంజూరైన పోస్టుల్లోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన కొత్త వారిని నియమించేటప్పుడు, ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కాంట్రాక్ట్ లెక్చరర్లకు తేల్చిచెప్పింది. ప్రస్తుత వ్యాజ్యాన్ని ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.తుహిన్ కుమార్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2000 సంవత్సరం నుండి తాము కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నామని, తమ సర్వీసును క్రమబద్ధీకరించకపోగా.. తాము ఉద్యోగాలు చేస్తున్న పోస్టులను ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్త అభ్యర్ధులతో భర్తీ చేయబోతున్నారని రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలేశ్వరం, పిఠాపురం తదితర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 18 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2014జూన్ నాటికి లేదా అంతకంటే ముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిని ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ చట్టం-2023 ప్రకారం రెగ్యులర్ చేయాల్సి ఉందన్నారు. అయితే తమ క్రమబద్ధీకరణ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టి, ఏపీపీఎస్సీ ద్వారా లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ ప్రారంభించారన్నారు. ఉద్యోగాలు పోతాయని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని కోర్టుకు తెలిపారు. ఏపీపీఎస్సీ తరఫున న్యాయవాది శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ... శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ ద్వారా పిటిషనర్లపై ప్రభావం పడుతుందా? లేదా అనేది స్పష్టత లేదన్నారు. ప్రస్తుత రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్ధులు పిటిషనర్ల పోస్టుల్లో నియమితులైతే.. మరో చోట పిటిషనర్లను సర్దుబాటు చేస్తారన్నారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఏళ్ల తరబడి సేవలు అందించిన వారి సర్వీసును క్రమబద్ధీకరించకుండా నిరాకరించడానికి వీల్లేదని, సుదీర్ఘ కాలం పనిచేసి పొందిన అనుభవమే వారి అర్హత అని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసులో తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌తో తమను ఉద్యోగాల నుండి తొలగిస్తారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న దగ్గరే పిటిషనర్లను కొనసాగించాలని స్పష్టం చేశారు.