ఆ నకిలీ పట్టాలు రద్దు
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:53 AM
మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వివిధ సర్వే నంబర్లలోని రోడ్లు, రోడ్డు మార్జిన్లు, స్మశాన వాటికలు, డ్రైనేజీ పోరంబోకు స్థలాల్లో వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల రద్దుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
పేర్నినాని, ఆయన కుమారుడు పంచిన ఇళ్ల పట్టాల
రద్దుకు 4 వారాల్లో చర్యలు తీసుకోండి: హైకోర్టు
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వివిధ సర్వే నంబర్లలోని రోడ్లు, రోడ్డు మార్జిన్లు, స్మశాన వాటికలు, డ్రైనేజీ పోరంబోకు స్థలాల్లో వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల రద్దుకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ, పురపాలక శాఖల అధికారులకు సూచించింది. మరోవైపు నకిలీ పట్టాల పంపిణీకి సహకరించిన అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యల వివరాలు సైతం తమ ముందు ఉంచాలని పేర్కొంది. విచారణను వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని కోరుతూ మచిలీపట్నానికి చెందిన ఐ.దిలీప్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఇతర వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా... పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.నిఖిత వాదనలు వినిపించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగాయని అధికారులు నిర్ధారించారని తెలిపారు. పట్టాల జారీలో చట్టనిబంధనలు అనుసరించలేదన్నారు. పేర్నినాని తరఫున న్యాయవాది వై.నాగిరెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్‌కు ఓ రాజకీయ పార్టీతో అనుబంధం ఉందన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం పిల్‌ను ఉపయోగించుకుంటున్నారని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... వాస్తవాలు దాచి పిల్ దాఖలు చేసినట్లు తేలితే పిటిషనర్‌కు ఖర్చులు విధిస్తామని స్పష్టం చేసింది.