Share News

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:48 AM

మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్సలర్‌, సినీనటుడు మోహన్‌బాబుకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

  • బాధితుడి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం

  • విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో..మోహన్‌బాబుకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్సలర్‌, సినీనటుడు మోహన్‌బాబుకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితుడి వాదనలు విన్న తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కేసు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యార్థి నాయకుల కిడ్నా్‌పకు సంబంధించి బాధితుడు రెడ్డి కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా ఈనెల 3న తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌బాబు పిటిషన్‌ వేశారు. మంగళవారం విచారణకు రాగా, మోహన్‌బాబు తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. కిడ్నాప్‌ ఘటనతో పిటిషనర్‌కు సంబంధం లేదని, ఆ సమయంలో ఆయన స్థానికంగా లేరన్నారు. వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొనేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఏపీపీ సందీప్‌ వాదనలు వినిపిస్తూ కిడ్నాప్‌ వ్యవహారంలో మోహన్‌బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయన్నారు. ఘటన సమయంలో ప్రధాన నిందితుడు వర్సిటీ పీఆర్‌వో సతీష్‌, మోహన్‌బాబు మధ్య ఫోన్‌, మెసేజ్‌ సంభాషణ జరిగిందన్నారు. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని పోలీసులు మంచు విష్ణుకు(ఏ3) నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాలేదన్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. బాధితుడి తరఫున న్యాయవాది మాధవరావు వాదనలు వినిపిస్తూ, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారి గొంతు నొక్కేయాలనే ఉద్దేశంతోనే పిటిషనర్‌ ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 03:48 AM