Share News

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:50 AM

వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగులకు హైకోర్టులో చుక్కెదురైంది.

అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం

  • మాజీ స్పీకర్‌ తమ్మినేనికి హైకోర్టులో చుక్కెదురు

  • ఆయన కుటుంబ సభ్యులకు కూడా..

  • కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది

  • క్వాష్‌ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులివ్వలేం

  • అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోండి: న్యాయమూర్తి

  • కౌంటర్‌ వేయాలని పోలీసులకు ఆదేశం

అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగులకు హైకోర్టులో చుక్కెదురైంది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్‌ పిటిషన్‌లో ఈ తరహా ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తుచేసింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. భూయజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి.. ఒడిసాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి.. విలువైన భూమిని తన కుమారుడి పేరు మీద రిజిస్టర్‌ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని, ఆయన భార్య, కుమారుడు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగు రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా రజని అనే మహిళ నుంచి భూమిని కొనుగోలు చేశారన్నారు. బీఎన్‌ఎ్‌సఎస్‌ 35(3) సెక్షన్‌ కింద వారికి నోటీసులిచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.


అధికారాన్ని దుర్వినియోగం చేశారు: పీపీ

పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లు క్రిమినల్‌ కేసును సివిల్‌ కేసుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. విలువైన ఆస్తిని కాజేయడానికి వారు, కేసులోని ఇతర నిందితులు కలిసి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సృష్టించారు. స్థల యజమాని హైదరాబాద్‌లో ఉంటారని నిర్ధారించుకుని.. ఆస్తి కాజేసేందుకు ప్రణాళిక రచించారు’ అని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... వివాదాస్పద రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగు పేరు మీద ఉందని, ఆయన తల్లిదండ్రులను నిందితులుగా ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. కేసుకు రాజకీయ రంగు పులిమారని అన్నారు. పీపీ బదులిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన తమ్మినేని సీతారాం అప్పట్లో స్పీకర్‌గా ఉన్నారని.. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించడమే గాక, సబ్‌ రిజిస్ట్రార్‌ను ప్రభావితం చేసి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిపారు.

ఆధారాలు చూపండి..

ఆస్తి కొనుగోలుకు సంబంధించి రజనికి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు ఉంటే కోర్టు ముందు ఉంచి సచ్ఛీలతను నిరూపించుకోవాలని పిటిషనర్లకు న్యాయమూర్తి సూచించారు. సీనియర్‌ న్యాయవాది సి.రఘు బదులిస్తూ.. పలు దఫాలుగా రజనికి రూ.37 లక్షలు చెల్లించామని.. దీనికి రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌నే ఆధారంగా పరిగణించాలన్నారు.

పోసాని కలుగజేసుకుని.. స్థలం రిజిస్ట్రేషన్‌ సమయంలో సొమ్ము చెల్లించినట్లు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారని, కానీ ఇప్పుడు సొమ్మును దఫదఫాలుగా చెల్లించినట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. బీఎన్‌ఎ్‌సఎస్‌ 35(3) ప్రకారం పిటిషనర్లకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకునేలా ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చారు.


ముందే సివిల్‌ సూట్‌ ఎందుకు వేశారు?

తన స్థలం ఆక్రమణకు గురైందని గుర్తించిన వెంటనే పోలీసు కేసు పెట్టకుండా.. ఫిర్యాదుదారు కట్టా జయకిశోర్‌ సివిల్‌ సూట్‌ ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అది దాఖలు చేసి రెండేళ్లు గడిచాక క్రిమినల్‌ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జయకిశోర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు బదులిస్తూ.. ఫోర్జరీ చేసిన దస్త్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఫిర్యాదుదారుకు అవగాహన లేదన్నారు. దీంతో ఆక్రమణల తొలగింపు గురించి సివిల్‌ కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం రిజిస్ట్రేషన్‌ వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు వారి సొంత ఉద్యోగులే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. పోలీసులు కవులుగా మారారని, వారు ఏమైనా సృష్టించగలరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారాక.. అంతకుముందు నమోదు చేసిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులకు క్లీన్‌ చిట్‌ ఇస్తున్నారన్నారు. ఇది దురదృష్టకరమని.. లా అండ్‌ ఆర్డర్‌ చట్టనిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదని తెలిపారు.

Updated Date - Jul 22 , 2026 | 04:51 AM