Share News

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరణ

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:50 AM

ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్ రెడ్డికి 1+1 భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరణ

  • ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్ రెడ్డికి భద్రత పునరుద్ధరణ ఉత్తర్వులపై హోం శాఖ అప్పీల్‌

  • అప్పీల్‌పై లోతైన విచారణ అవసరం: ధర్మాసనం

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ్‌ ప్రతాప్ రెడ్డికి 1+1 భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి వేసిన అప్పీల్‌పై విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చింతా విజయ్‌ ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తొలగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్‌జీపీ) యతీంద్ర దేవ్‌ వాదనలు వినిపిస్తూ ‘ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేదు. ఈ కారణంతోనే ఆయనకు ఉన్న భద్రతను తొలగించాం. తనకు ప్రాణహాని ఉన్నట్లు విజయ్‌ ప్రతా్‌పరెడ్డి ఎలాంటి ఆధారాలను హైకోర్టుకుగానీ, భద్రత రివ్యూ కమిటీ ముందుకానీ ఉంచలేదు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చైర్మన్‌ హోదాలో పిటిషనర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు కదా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. విజయ్‌ ప్రతా్‌పరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... భద్రతను పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Updated Date - Jun 17 , 2026 | 05:51 AM