విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:57 AM
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని...
దీనిపై దేవదాయ శాఖ సర్క్యులర్ ఇచ్చింది
శృంగేరి పీఠం ప్రామాణికాన్నీ అమలు చేయండి
ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని దేవదాయ శాఖ 2010 నవంబరు 10న సర్క్యులర్ జారీ చేసిందని, అలాగే శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 2024 డిసెంబరు 20న ప్రామాణికం జారీ చేశారని గుర్తు చేసింది. పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించి, వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాలయాల్లో ఆచారాలు, ఆగమ శాస్త్ర పద్ధతులకు సంబంధించి దేవదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్ మెమో, శృంగేరి శారద పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎ్‌సఎ్‌సఎస్ సుబ్రహ్మణ్య సోమయాజి పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదనే నిబంధన అమలు కావడం లేదన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశాలకు వెళ్లినవారు, సంప్రదాయాలకు విరుద్ధంగా జుత్తు కత్తిరించుకున్నవారు గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని తెలిపారు. దేవదాయ శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... దేవాలయాల్లో పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో దేవదాయ శాఖ ఇచ్చిన సర్క్యులర్ మెమో, శృంగేరి పీఠం జారీ చేసిన ప్రామాణికం పాటిస్తామని విన్నవించారు.