Share News

సునీల్‌ నాయక్‌తో కలిపి మిమ్మల్ని విచారించాల్సి రావొచ్చు

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:16 AM

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారన్న కేసులో దర్యాప్తునకు సహకరించాలని...

సునీల్‌ నాయక్‌తో కలిపి మిమ్మల్ని విచారించాల్సి రావొచ్చు

  • కస్టోడియల్‌ టార్చర్‌ కేసు దర్యాప్తునకు సహకరించండి

  • ఐవో కోరినప్పుడు విచారణకు హాజరుకండి

  • ఐపీఎస్‌ పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేశారన్న కేసులో దర్యాప్తునకు సహకరించాలని ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏడవ నిందితుడిగా ఉన్న బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌, అప్పటి సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌నూ, పీఎస్సార్‌ ఆంజనేయులనూ కలిపి విచారించాల్సి రావచ్చని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌పై ఎలాంటి కఠిన చర్యలకు తీసుకోవద్దని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. ఈ మేరకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను పరిష్కరించింది. తాజాగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకొనేందుకు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారంటూ రఘురామకృష్ణం రాజు పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీతారామాంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కస్టోడియల్‌ టార్చర్‌ ఘటనలో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు(ఏ2) పాత్ర గురించి సునీల్‌ నాయక్‌ను ప్రశ్నించాల్సి ఉందన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనం కేసులో పిటిషనర్‌ మెడికల్‌ బెయిల్‌ పొందారని గుర్తు చేశారు. పీఎ్‌సఆర్‌ తరఫున న్యాయవాది అభయ్‌ సిద్ధాంత్‌ వాదనలు వినిపిస్తూ... ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను మరోరోజుకి వాయిదా వేస్తే అభ్యంతరం లేదన్నారు. మెడికల్‌ బెయిల్‌ పొడిగింపునకు తాము వేసిన అనుబంధ పిటిషన్‌ సోమవారం విచారణకు వస్తుందన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ను అరెస్ట్‌ చేసే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 04:16 AM