Share News

పదోన్నతులివ్వకుండా వేధిస్తున్నారు

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:42 AM

పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎ స్‌టీ) అహ్మద్‌బాబుపై చర్యలు తీసుకునేలా...

పదోన్నతులివ్వకుండా వేధిస్తున్నారు

  • పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు

  • రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌పై ఏపీజీఈఏ వ్యాజ్యం

  • అహ్మద్‌బాబును సుమోటోగా ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎ స్‌టీ) అహ్మద్‌బాబుపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డీపీసీ (డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) సమావేశం నిర్వహించి నెలలు గడుస్తున్నా పదోన్నతులివ్వకుండా అహ్మద్‌బాబు ఫైలును తొక్కిపెట్టారని ఈ సంఘం ఆరోపిస్తోందని గుర్తుచేసింది. ఉద్యోగులకు పదోన్నతి కల్పించకపోవడం వారి జీవించే హక్కును హరించడమేనని పేర్కొంది. ఉద్యోగుల సంఘం ఆరోపణలు నిజమేనని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. తీవ్రఆరోపణలు ఉన్న కేసులో సంబంధిత అధికారిని ప్రతివాదిగా చేర్చకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబును సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు.

Updated Date - Apr 10 , 2026 | 03:43 AM