Share News

15 జిల్లాల్లో భగ భగలు

ABN , Publish Date - May 23 , 2026 | 04:45 AM

రాష్ట్రంలో శుక్రవారం కూడా తీవ్ర వడగాడ్పులు కొనసాగాయి. వాయవ్య దిశ నుంచి వీచిన వేడిగాలులకు ఉదయం పది గంటలకే కోస్తాలోని అనేక ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి.

15 జిల్లాల్లో భగ భగలు

  • రాత్రి 8 గంటలైనా వేడి సెగలే.. రాజమండ్రిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత

  • ఎండ దెబ్బకు 16 మంది బలి.. నెల్లూరు, సీమ ప్రాంతాల్లో జల్లులు

రాష్ట్రంలో శుక్రవారం కూడా తీవ్ర వడగాడ్పులు కొనసాగాయి. వాయవ్య దిశ నుంచి వీచిన వేడిగాలులకు ఉదయం పది గంటలకే కోస్తాలోని అనేక ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. సాయంత్రం వరకు గాడ్పులు కొనసాగడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా వాతావరణం చల్లబడలేదు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం 15 జిల్లాల్లోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 44.8, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడుల్లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకు ఉపరితలద్రోణి, దక్షిణ ఒడిశాలో ఉపరితల ఆవర్తనం విస్తరించాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శనివారం రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మిగిలినచోట్ల తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతాయని పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ వరకు వడగాడ్పులు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం 221 మండలాల్లో వడగాల్పులు, 13 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


ఉమ్మడి ‘తూర్పు’లోనే 10 మంది మృత్యువాత

ఎండ దెబ్బకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం ఆరుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరు, విజయవాడలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఒకరు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లా ఇద్దరు మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పది మంది మృతి చెందినట్లు సమాచారం అందింది. ఇక, రాజమహేంద్రవరంలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగత్ర నమోదైంది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 45.1, కాకినాడ జిల్లా తునిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రూ.48 లక్షలతో ట్రాఫిక్‌ పోలీసులకు వేసవి రక్షణ సామగ్రి

మండుటెండలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు తరచూ అనారోగ్యం పాలవుతుండటంపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా స్పందించారు. వారి రక్షణ నిమిత్తం అవసరమైన పరికరాలు అందించేందుకు రూ.48 లక్షలు కేటాయించారు.

Updated Date - May 23 , 2026 | 04:47 AM