మండిన రాయలసీమ
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:56 AM
ఎండ తీవ్రత, వడగాడ్పులతో మంగళవారం రాయలసీమ ఠారెత్తిపోయింది. కోస్తాలో కూడా పొడిగాలుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
ఈ సీజన్‌లో ఇదే అత్యధికం
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత, వడగాడ్పులతో మంగళవారం రాయలసీమ ఠారెత్తిపోయింది. కోస్తాలో కూడా పొడిగాలుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలిలో తేమశాతం తగ్గడం, వాయవ్య దిశ నుంచి గాలులు రావడంతో రాయలసీమ, కోస్తాల్లోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. దాదాపు 262 మండలాల్లో 40డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో 45 డిగ్రీలు నమోదుకావడం ఇదే తొలిసారి. కాగా, అసోం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉత్తర, దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఈ నెల 18వరకు రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణుడు ఒకరు హెచ్చరించారు. బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లోని 73 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరుబయట పనిచేసేవారు ఉదయం 11 గంటలలోపే ఇళ్లకు రావాలని, చిన్నారులు, వృద్ధులు, బాలింతలు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.