Share News

వడగాల్పులపై అప్రమత్తం!

ABN , Publish Date - Mar 15 , 2026 | 03:52 AM

రాష్ట్రంలో ఈ ఏడాది వడగాల్పులు అధికంగా నమోదైయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

వడగాల్పులపై అప్రమత్తం!

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌-2026 సిద్ధం

గంటగంటకు ప్రజల్ని అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు

ఆస్పత్రుల్లో 1.77 కోట్ల ఓఆర్‌ఎస్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌

108 అంబులెన్సుల్లో ఐస్‌ప్యాక్‌లూ సిద్ధం

సన్నద్ధంగా ఉన్నాం: మంత్రి సత్యకుమార్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో ఈ ఏడాది వడగాల్పులు అధికంగా నమోదైయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ఆధారంగా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌- 2026 రూపొందించింది. ఇప్పటికే ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ‘అవేర్‌ ప్లాట్‌ఫామ్‌’ ద్వారా రానున్న 4-5 రోజుల్లో వేసవి తీవ్రత ఎలా ఉంటుందన్న సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. వాతావరణ కేంద్రాల ద్వారా అందే సమాచారంతో ఏ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువుందో గుర్తించి ఆరోగ్యశాఖ ద్వారా ఈ సమాచారాన్ని కలెక్టర్లు, ఇతర అధికారులకు అందిస్తారు. దీనికి అనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు. ఉష్ణోగత్ర 27 నుంచి 32 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వరకు నమోదైతే ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. 33 నుంచి 41 డిగ్రీల వరకు డేంజర్‌లో ఉన్నట్లు, 42 నుంచి 54 డిగ్రీల వరకు ‘వెరీ డేంజర్‌’గా అవేర్‌ డిజిట్‌ ప్లాట్‌ఫామ్‌లో గుర్తిస్తారు. గంటగంటకు నమోదైన ఉష్ణోగ్రతలను అంచనా వేసుకుని ప్రజల్ని అప్రమత్తం చేస్తారు.


రియల్‌ టైమ్‌లో పర్యవేక్షణ..

సీజనల్‌ వ్యాధులను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించి, వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఆర్టీజీఎ్‌సలో అవేర్‌ సేవలను ఆరోగ్యశాఖ వినియోగించుకుంటోంది. గత పదేళ్ల కాలంలో ఏయే జిల్లాల్లో, మండలాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉందో మ్యాపింగ్‌ ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఐహెచ్‌ఐపీ పోర్టల్‌ ద్వారా రోజువారీ డేటా సేకరణ, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ చేస్తున్నారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌-2026 వివరాలను జిల్లా వైద్యాధికారులు, సర్వైలెన్స్‌ ఆఫీసర్లు, ఎపిడమాలజిస్టులు, ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లకు పంపించారు. ఆ వివరాలతో పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల)లో పనిచేసే వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి తిరిగి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులూ జాతీయ స్థాయిలో జిల్లాల్లోని ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్‌గా శిక్షణ ఇచ్చారు. వడదెబ్బకు గురైనవారికి ప్రతి పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. తీవ్రతను బట్టి 108 ద్వారా ఉన్నతస్థాయి ఆస్పత్రులకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు 1.77 కోట్ల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆస్పత్రుల్లో సిద్ధం చేశారు. 108 అంబులెన్సుల్లో ఐస్‌ప్యాక్‌లు సిద్ధం చేసి, అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచారు. పీహెచ్‌సీల్లో 50 లక్షలు, యూపీహెచ్‌సీల్లో 16 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఐవీ ఫ్లూయిడ్స్‌ కూడా సిద్ధం చేశారు. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, నిర్మాణ రంగ కూలీలు, గ్రానైట్‌, ఉపాధి కూలీలు, ట్రాఫిక్‌ పోలీసులు, వేసవి తీవ్రతకు ప్రభావితమయ్యే ఇతర రంగాల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో 2023లో 833 మంది, 2024లో 4,444 మంది, 2025లో 5,154 మంది వడదెబ్బకు గురైనట్లు తేలింది. కానీ, కొన్ని జిల్లాల్లో వడదెబ్బ కేసులను రిపోర్టు చేయడం లేదు. దీంతో ఈ ఏడాది ప్రతి కేసు రిపోర్టయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


జూన్‌ వరకూ జాగ్రత్త

జూన్‌ వరకూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాల అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎ్‌సలు, ఐవీఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాం.

- మంత్రి సత్యకుమార్‌

Updated Date - Mar 15 , 2026 | 03:53 AM