Share News

సిమ్యులేటర్లకు 13.2 కోట్లా..!

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:01 AM

అంతగా అవసరం లేని వైద్య పరికరాల కొనుగోలుకు ఆరోగ్యశాఖ అధికారులు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు పెంపు కోసం అందించే నిధులను ఇలా దుర్వినియోగం చేస్తున్నారు.

సిమ్యులేటర్లకు 13.2 కోట్లా..!

  • అత్యధిక ధరతో కొనుగోలుకు బీఎఫ్‌సీలో ఆమోదం

  • అవసరం లేదంటున్న వైద్యులు.. పీజీ నిధులు వృథా

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): అంతగా అవసరం లేని వైద్య పరికరాల కొనుగోలుకు ఆరోగ్యశాఖ అధికారులు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు పెంపు కోసం అందించే నిధులను ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. బుధవారం జరిగిన బీఎఫ్‌సీ (బిడ్‌ ఫైనలైజ్‌ కమిటీ) సమావేశంలో మన్నికైన వైద్య పరికరాలకు సంబంధించి రెండు రకాల వైద్య పరికరాల కొనుగోలుకు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ అనుమతిచ్చారు. విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు మెడికల్‌ కాలేజీల్లో ఈఎన్‌టీ విభాగాలకు సిమ్యులేటర్లు(అనుకరణ యంత్రాలు) కొనుగోలుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు గైనిక్‌ విభాగం కోసం హిస్టెరోస్కోపీ పరికరానికి రెండేళ్లపాటు రేటు కాంట్రాక్ట్‌ (ఆర్సీ) ఇచ్చేందుకు అనుమతిచ్చారు. వీటిలో ఈఎన్‌టీ విభాగాల కోసం కొనుగోలు చేసే సిమ్యులేటర్‌ వ్యయం రూ.4.4 కోట్లు. ఈ లెక్కన మూడు కాలేజీలకూ కలిపి రూ.13.2 కోట్లు ఽఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్యార్థులు నిజమైన రోగులపై ప్రయోగాలు చేసే ముందు.. ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు సిమ్యులేటర్లను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం కొన్ని మెడికల్‌ కాలేజీల్లో సిమ్యులేటర్లు వాడకుండా మూలన పడేశారు. కేవలం డెమో చూపించడానికి వాడే వీటిని తక్కువ ధరలో కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ ఆరోగ్యశాఖ అధికారులు వీటికోసం రూ.13.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ నిధులతో విజయవాడ, విశాఖ, ఒంగోలు మెడికల్‌ కాలేజీలకు అవసరమైన మరికొన్ని ముఖ్యమైన వైద్య పరికరాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సిమ్యులేటర్లకు ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వైద్యులు కూడా చెబుతున్నారు. అయినా వీటి కొనుగోలుకు బీఎ్‌ఫసీ సమావేశంలో ఆమోదం లభించింది. మరోవైపు టెండర్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగాయి. ఈ అడ్డగోలు వ్యవహారంపై తీవ్ర విమర్శలు, సిమ్యులేటర్ల కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 09 , 2026 | 05:02 AM