ఆరోగ్య శాఖకు పటిష్ఠమైన హెచ్‌ఆర్ పాలసీ!
ABN , Publish Date - May 30 , 2026 | 04:23 AM
ఆరోగ్యశాఖలో మానవ వనరుల వినియోగ(హెచ్‌ఆర్ పాలసీ) విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు.
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో మానవ వనరుల వినియోగ(హెచ్‌ఆర్ పాలసీ) విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. విజయవాడలో హెచ్‌ఆర్ పాలసీపై శుక్రవారం ఎన్‌హెచ్‌ఎం, కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత హెచ్‌ఆర్ పాలసీ మార్గదర్శకాలు అనుసరించడం వల్ల పలు సందర్భాల్లో తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. జాతీయ కార్యక్రమాల అమలుకు తగ్గట్లు వైద్య సేవలు అందించడానికి తగిన సౌకర్యాలు, సిబ్బంది, వైద్యులు ఉన్నారా? లేకుంటే కొరత ఏ స్థాయిలో ఉందన్న విషయాలపై ఏపీ సహా పలు రాష్ట్రాల్లో హెచ్‌ఆర్ పాలసీ అమలును కేంద్రం సమీక్షిస్తోంది. హెచ్‌ఆర్ పాలసీ పటిష్ఠంగా ఉండేందుకు ఆరోగ్య శాఖలో అష్టాంగ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. వైద్యుల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర కార్యకలాపాలు మానవ జోక్యం లేకుండా ఆన్‌లైన్‌లో జరగిపోవాలి. కొన్ని పోస్టులకు కేటాయించిన విధులను సవరించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.