తమిళనాడులో మందుల పంపిణీపై అధ్యయనం
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:14 AM
తమిళనాడులోని ప్రభుత్య ఆసుపత్రులకు జరుగుతున్న మందుల సరఫరా వ్యవస్థపై ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది.
చెన్నైలో డీఎంఈ విష్ణు కమిటీ పర్యటన
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని ప్రభుత్య ఆసుపత్రులకు జరుగుతున్న మందుల సరఫరా వ్యవస్థపై ఏపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ మంగళవారం చెన్నైలో పర్యటించింది. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలోని కమిటీ చెన్నైలో పర్యటిస్తోంది. కమిటీ సభ్యులు చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి డీన్ డాక్టర్ శాంతారామన్‌తో భేటీ అయ్యారు. రోగులకు అందిస్తున్న మందుల కొనుగోలు, పంపిణీపై చర్చించారు. అలాగే చెన్నైలోని ‘తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్’ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణన్ ఉన్నితో కూడా భేటీ అయ్యారు.
నేటి నుంచి సదరం స్లాట్స్
దివ్యాంగుల డేటా బేస్ భద్రత కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు వెల్లడించారు. ఈ డేటాలో అనధికారికంగా మార్పులు చేయడం కుదరదని స్పష్టం చేశారు. రెండో త్రైమాసిక స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.