Share News

‘లోకల్‌’ రూల్స్‌తో మందుల మాయ

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:37 AM

ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత ఏర్పడుతుందని 3నెలల నుంచే అధికారులకు ముందస్తు సమాచారం ఉంది. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు...

‘లోకల్‌’ రూల్స్‌తో మందుల మాయ

  • ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత

  • సమకూర్చడంలో డీఎంఈ, ఏపీఎంఎస్ఐడీసీ నిర్లక్ష్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత ఏర్పడుతుందని 3నెలల నుంచే అధికారులకు ముందస్తు సమాచారం ఉంది. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు లేఖల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత నివారణ చర్యల్లో ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) లేఖలను బుట్టదాఖలు చేయడంతో పాటు డీఎంఈ, ఏపీఎంఎస్ఐడీసీ సమన్వయ లోపం కారణంగా కొరత ఏర్పడింది. మరోవైపు వారం రోజుల్లో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌(సీడీఎస్)లో మందుల సంఖ్యను పెంచుతామని కార్పొరేషన్‌ డ్రగ్‌ విభాగం అధికారులు గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత మరింత తీవ్రం అవుతోంది. సీడీఎస్ల్లో మందుల కొరత ఏర్పడితే లోకల్‌ పర్చేస్‌ కింద మందులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు సూపరింటెండెంట్లకు ఉంది. లోకల్‌ పర్చేస్‌ కింద 20 శాతం బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులకు ఇస్తుంది. ఈ నిధులతో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో అందుబాటులో లేని మందులను అత్యవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ల చేతులు కట్టేశారు. లోకల్‌ పర్చేస్‌ కింద మందులను ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి కేంద్రాల(పీఎంబీజేకే) నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించడం బోధనాసుపత్రులకు శాపంగామారింది. స్థానికంగా టెండర్లు పిలిచినా పీఎంబీజేకేల నుంచే మందులు కొనుగోలు చేయాలని ఆర్డర్లు జారీ చేశారు. ఉన్నతాధికారులు చెప్పడంతో సూపరింటెండెంట్లు పీఎంబీజేకే లైసెన్సులున్న ఒక కంపెనీతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. సదరు కంపెనీ ఆస్పత్రులకు మందులు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. ఆస్పత్రుల నుంచి ఆర్డర్లు పెట్టిన తర్వాత నెల రోజులకు కూడా మందుల సరఫరా చేయలేకపోతోంది. దీంతో మందుల కొరత తీవ్రమైంది. దీనిపై బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు ఇప్పటికే డీఎంఈకి ఫిర్యాదులు చేశారు. బోధనాసుపత్రులకు అవసరమైన అన్ని రకాల మందులు సదరు కంపెనీ వద్ద ఉండకపోవడంతో పాటు తాము అడిగిన మేరకు సరఫరా చేయడంలో విఫలమవుతోందని చెబుతున్నారు.


మరోవైపు బోధనాసుపత్రుల నుంచి ఆర్డర్లు పెట్టిన 3, 4 రోజుల తర్వాత తమవద్ద స్టాక్‌ లేదన్న సమాధానాలు వస్తున్నాయని, ఆ తర్వాతే తాము స్థానికంగా ఉన్న మందుల కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాల్సి వస్తోందని సూపరింటెండెంట్లు చెబుతున్నారు. పీఎంబీజేకే వల్ల సమయం వృథా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని లేఖల ద్వారా సృష్టం చేశారు. కానీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, డీఎంఈ.. పీఎంబీజేకేని బలవంతంగా బోధనాసుపత్రులపై రుద్దుతున్నారు. ఇక సర్జికల్‌ ఐటమ్స్‌ విషయానికి వస్తే.. బడ్జెట్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. బోధనాసుపత్రులకు సర్జికల్‌ బడ్జెట్‌ను విడుదల చేస్తే తప్ప ఆ సమస్య పరిష్కరం కాదు.

పెనాల్టీ లేదు.. డిస్‌క్వాలిఫై చేయరు

పీఎంబీజేకేకి సంబంధించి ఆరోగ్య శాఖ ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదు.సూపరింటెండెంట్లు అడిగిన మందులు సరఫరా చేయడంలో సదరు కంపెనీ విఫలమైనా ఎలాంటి పెనాల్టీలు వేయడానికి, డిస్‌క్వాలిఫై చేయడానికి వీలులేదు. రోగులు ఇబ్బందులు పడుతున్నా ఆ కంపెనీకే ఆర్డర్లు ఇవ్వాలన్న విధంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోధనాసుపత్రులు మందుల కొనుగోలుకు పర్చేస్‌ ఆర్డర్‌ ఇచ్చాక కొన్ని మందులు 24 గంటల్లోనే సరఫరా చేయాలి, మరికొన్ని మందులు రెండు లేదా మూడు రోజుల్లో సరఫరా చేయడానికి సమయం ఇస్తారు. ఆ సమయంలోగా మందులు సరఫరా చేయకపోతే సదరు కంపెనీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. మరోవైపు పీవో తీసుకుని మందులు సరఫరా చేయడంలో విఫలమైతే కంపెనీనీ డిస్‌క్వాలిఫై చేసే అధికారం సూపరింటెండెంట్లకు ఉంటుంది. అయితే పీఎంబీజేకే ద్వారా మందులు సరఫరా చేసే కంపెనీకి ఈ నిబంధనలు ఏవీ వర్తించవు. ఆ కంపెనీ ఎప్పుడు మందులు సరఫరా చేస్తే అప్పుడు సూపరింటెండెంట్లు తీసుకోవాలి. తర్వాత రోగులకు ఇవ్వాలి. సదరు కంపెనీ నిర్వాకం వల్ల సూపరింటెండెంట్లు రోగులకు మందులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో లోకల్‌ పర్చేస్‌ విషయంలో సూపరింటెండెంట్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 03:37 AM