ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్
ABN , Publish Date - May 06 , 2026 | 04:19 AM
వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పట్టింది. ఇప్పుడా శాఖకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. శాఖలో కింది నుంచి పైస్థాయి వరకు అధికారులంతా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.
శస్త్రచికిత్స అనివార్యం.. అందరిదీ బాధ్యతారాహిత్యమే
సీఎం జోక్యం చేసుకుంటేనే మార్పు.. కీలక అధికారి అవినీతి పరాకాష్ఠకు
ఢిల్లీ కంపెనీలకు అత్యంత ‘గౌర’వం.. అక్కడే కలెక్షన్లు.. ఆంధ్రాలో ఆర్డర్లు
కార్పొరేషన్‌లో చెప్పిందే శాసనం.. సొమ్ములిస్తేనే టెండర్లు, బిల్లులు
పరికరాల కొనుగోలులో నాణ్యతకు చెల్లు.. రూ.50 కోట్లకు పైగా వృథా
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పట్టింది. ఇప్పుడా శాఖకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. శాఖలో కింది నుంచి పైస్థాయి వరకు అధికారులంతా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి వారు సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని ‘మా వాటా ఎంతిస్తారో చెప్పండి’ అంటూ బహిరంగ బేరాలకు దిగుతున్నారు. సూది, దూది దగ్గర నుంచి వైద్య పరికరాల కొనుగోలు వరకూ ప్రతిదాంట్లో సెటిల్‌మెంట్లే. మంత్రి సమీక్షల పేరుతో సమస్యలపై ఫోకస్ పెట్టినా లోతుల్లోకి వెళ్లడం లేదు. దీంతో అధికారులు ఆరోగ్యశాఖను భ్రష్టుపట్టిస్తున్నారు. ముఖ్యంగా శాఖలో కీలక అధికారి అవినీతి పరాకాష్ఠకు చేరింది. సివిల్, డ్రగ్స్, ఎక్విప్‌మెంట్.. ఇలా అన్ని విభాగాల్లో కమీషన్లు కొట్టేస్తున్నారు. చివరికి మెగా నిర్మాణ సంస్థలను కూడా వదిలి పెట్టడం లేదు. వారాంతానికి ఢిల్లీ వెళ్లే సదరు అధికారి డీల్స్ మొత్తం అక్కడే చేసుకుంటున్నారు. శని, ఆదివారాల్లో డీల్స్ మాట్లాడుకుంటారు. సోమవారం ఆంధ్రాకు వచ్చి ఆర్డర్లు ఇస్తారు. వచ్చిన పర్సంటేజ్ తీసుకుంటారు. ఇది ఆయనకు రొటీన్‌గా మారింది. ఆరోగ్యశాఖలో కీలకమైన ఏపీఎంఎస్ఐడీసీ (మందుల కార్పొరేషన్) ఆయన చేతుల్లో ఉంది. దీంతో కార్పొరేషన్‌లో ఆయన సొంత రూల్స్ అమలు చేస్తూ.. మొత్తం శాఖనే శాసిస్తున్నారు. ప్రజాధనం వృథా అవుతుందన్న విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రశ్నిస్తుందన్న ఆలోచన కూడా లేదు.
సీఎంవోకు ఫిర్యాదు
రాష్ట్రంలో కోట్ల రూపాయల సివిల్ వర్కులు చేసే పెద్ద కంపెనీ యజమానికి కూడా సదరు అధికారి నుంచి వింత అనుభవం ఎదురైంది. మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న ఆ కంపెనీ యజమాని తమ పెండింగ్ బిల్లుల కోసం ఆ అధికారిని కలిశారు. తమ కంపెనీకి సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. వచ్చింది ఎవరన్నది కూడా చూడకుండా కనీసం 8 శాతం పర్సంటేజ్ ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్ చేశారు. ఇది విని షాక్ అయిన యజమాని నేరుగా సీఎంవోకు వెళ్లి విషయం చెప్పారు. ఆరోగ్యశాఖలో దాదాపు ప్రతి కాంట్రాక్టర్, సప్లయర్స్‌కు సదరు అధికారితో ఇదే విధమైన అనుభవాలు ఎదురయ్యాయి. తక్షణం ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు సీఎం జోక్యం చేసుకోవాలి. అలా కాకుండా ఇలానే వదిలిస్తే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడే ప్రమాదం ఉంది.
టెండర్ పిలిస్తే నాకేంటి
టెండర్ ఏదైనా పర్సంటేజ్ మాత్రం కామన్ అన్నట్లు సదరు అధికారి తీరు ఉంటోంది. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతిలలో కేంద్రం నిధులతో సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్మించారు. వీటి ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. విశాఖలోని సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రభుత్వం పీపీపీకి ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడ, తిరుపతిలో మాత్రం హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని భావిస్తోంది. హైబ్రిడ్ విధానంలో ప్రభుత్వమే వైద్య పరికరాలు సమకూర్చి, వాటి నిర్వహణ బాధ్యత మొత్తం ప్రైవేటు సంస్థకు అప్పగిస్తుంది. విశాఖలో మాత్రం వైద్య పరికరాలన్ని పీపీపీ సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. ఏడాది క్రితమే సెంట్రల్ డయాగ్నోస్టిక్ భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకూ వీటిని అందుబాటులోకి తీసుకురాలేదు. పీపీపీ, హైబ్రిడ్ విధానంలో టెండర్ పిలిచి, వెంటనే నిర్వహణ సంస్థను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. అయినా శాఖలో కీలక అధికారి టెండర్ ప్రక్రియకు వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో డయాగ్నోస్టిక్ సెంటర్ల టెండర్ల కోసం ఎదురుచూస్తున్న కొన్ని సంస్థల ప్రతినిధులు సదరు అధికారిని సచివాలయంలో కలిశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల టెండర్లు వెంటనే పిలవాలని కోరారు. సంస్థల ప్రతినిధులు చెప్పిందంతా విన్న సదరు అధికారి వారికి ఊహించని షాక్ ఇచ్చారు. ‘టెండర్లు పిలవాలా..? టెండర్లు పిలిస్తే నాకేమిస్తారు? మీరు ఎంత పర్సంటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి? అప్పుడు టెండర్ గురించి ఆలోచిద్దాం’ అంటూ బహిరంగంగానే అడిగేశారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు మారు మాట్లాడకుండా సైలెంట్‌గా బయటకు వచ్చేశారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరించినా...
ముఖ్యంగా వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో సదరు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశాఖలో నాణ్యమైన మందులు, నాణ్యమైన వైద్య పరికరాలు ఉంటేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఈ విషయాన్ని గాలికి వదిలేసిన ఆ అధికారి నాణ్యతకు చెల్లుచీటీ ఇచ్చి.. జేబు నింపుకొనే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఢిల్లీ కంపెనీలకు అత్యంత ‘గౌర’వం ఇస్తూ..వారినే ప్రోత్సహిస్తున్నారు. శాఖకు వచ్చిన ఏడు నెలల్లో దాదాపు రూ.50 కోట్లపైగా ప్రజాఽధనం వృథా చేసినట్లు తెలుస్తోంది. కమీషన్లు ఇచ్చిన కంపెనీల కోసం అవసరం లేకపోయినా కోట్లాది రూపాయలు వెచ్చించి వైద్య పరికరాలు కొనుగోలు చేయడం, టెండర్లలో రూల్స్ బ్రేక్ చేసి మరీ అర్హత లేని కంపెనీని ఎంపిక చేయడం చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు ప్రతీ టెండర్ విషయంలో ఇదే ధోరణి. సదరు అధికారి వ్యవహార శైలిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కీలక అధికారి ఫోన్ చేసి మరీ హెచ్చరించారు. అయినా ఆ అధికారి తీరులో ఎలాంటి మార్పూ రాకపోగా... పర్సంటేజ్ పెంచి మరీ కమీషన్లు తీసుకుంటున్నారు.