Share News

High Court: చట్టనిబంధనలు పాటించకుండా ఎఫ్‌ఐఆర్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:58 AM

ఇసుక దొంగతనం ఆరోపణలతో నమోదు చేసిన కేసులో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

High Court: చట్టనిబంధనలు పాటించకుండా ఎఫ్‌ఐఆర్‌

  • కేసు నమోదులో యాంత్రికంగా వ్యవహరించారు

  • పోలీసుల వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు

అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఇసుక దొంగతనం ఆరోపణలతో నమోదు చేసిన కేసులో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రూ.5వేల విలువ కలిగిన ఆస్తి చోరీ కేసులో మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోకుండా పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 303(2) ప్రకారం దొంగలించిన ఆస్తి విలువ రూ.5వేలకు లోబడి, మొదటిసారి నేరానికి పాల్పడి ఉంటే.. అది నాన్‌-కాగ్నిజబుల్‌ నేరం కిందికి వస్తుందని గుర్తుచేసింది. తహశీల్దార్‌ నివేదిక ప్రకారం ప్రస్తుత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ రూ.1,500 మాత్రమేనని పేర్కొంది. ఖనిజ చట్ట నిబంధనల ప్రకారం అధీకృత అధికారి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత కేసులో మేజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం చార్జిషీట్‌ దాఖలు వరకూ యాంత్రికంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రసిదుల్లాపై కర్నూలు మేజిస్ట్రేట్‌ కోర్టు వద్ద విచారణ పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పిటిషనర్‌ పై చట్టప్రకారం అధికారులు చర్యలు తీసుకోవచ్చని, ప్రస్తుత ఉత్తర్వులు అందుకు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక దొంగతనం ఆరోపణలతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన పి.రసిదుల్లాపై సి.బెళగల్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 303(2), ఖనిజ చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కర్నూలు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ వద్ద జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరుతూ రసిదుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ఇటీవల విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jan 15 , 2026 | 03:59 AM