Share News

బాబోయ్‌ బ్రిడ్జీలు!

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:01 AM

వంతెనల నిర్వహణలో రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ విఫలమైంది. గత కొన్నేళ్లుగా కీలకమైన రహదారి వంతెనలను పట్టించుకోకపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

బాబోయ్‌ బ్రిడ్జీలు!

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద స్థితిలో 1572 వంతెనలు

  • వీటిలో 520 అతిప్రమాదకరమైనవి

  • ఇవిగాక యుద్ధప్రాతిపదికన

  • నిర్మించాల్సిన వంతెనలు మరో 72

  • మొత్తానికీ కలిపి రూ.2,533 కోట్లు

  • కావాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదన

ఏలూరు జిల్లా లింగపాలెం- కామవరపుకోట మండలాల మధ్య గుండేరు వాగుపై నిర్మించిన వంతెన 15ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు పిల్లర్లు కూలి మధ్యకు విరిగిపోయింది. స్థానిక ప్రజలు విరిగిన ఈ వంతెనపై మట్టిపోసి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలను సాగిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఇంకా అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వంతెనల నిర్వహణలో రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ విఫలమైంది. గత కొన్నేళ్లుగా కీలకమైన రహదారి వంతెనలను పట్టించుకోకపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఏకంగా 1572 కీలకమైన రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఇందులో 520 మహాప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇది ఎవరి మాటో కాదు.. స్వయంగా రోడ్లు-భవనాల శాఖే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. గత కొన్నేళ్లుగా వంతెనల నిర్వహణ సరిగా లేకపోవడం, అసలు పట్టించుకోని కారణంగానే అవి దెబ్బతిన్నాయని, ఇప్పుడు వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని, తక్షణమే పునర్నిర్మించాలని తెలిపింది. ఇందుకోసం కనీసం రూ.1700 కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది. ఇవిగాక మరో 72 వంతెనలను కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాల్సి ఉందని, వీటికోసం మరో రూ.833 కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టింది. అంటే 592 వంతెనల నిర్మాణానికి రూ.2533 కోట్లు కావాలని ప్రతిపాదించింది.


దమ్మిడీ ఖర్చుచేయలేదు..

గత రెండేళ్లలో రహదారి ప్యాచ్‌వర్క్‌లు, విస్తరణ, అభివృద్ధి కోసమే ఆర్‌అండ్‌బీ రూ.2800 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు కేవలం 592 వంతెనల పునర్నిర్మాణానికే 2533 కోట్లు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. ఈ గణాంకాలు ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒకేసారి ఇన్ని రహదారి వంతెనలు ఎందుకు దెబ్బతిన్నాయని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. గత కొన్నేళ్లపాటు వాటి బాగోగులను ఆర్‌అండ్‌బీ పట్టించుకోలేదు. నిర్వహణకు దమ్మిడీ కూడా ఖర్చుపెట్టలేదు. మరి రాష్ట్రంలో కేవలం వంతెనల పునర్నిర్మాణానికి తీసుకొచ్చిన ఎన్‌డీబీ ప్రాజెక్టు ఏమైనట్లు? ఇదే ఇప్పుడు అంతుచిక్కని అంశంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో చిన్నవి, పెద్దవి కలిపి 5969 రహదారి వంతెనలు ఉన్నాయి. రహదారులతోపాటు బ్రిడ్జీల నిర్వహణ, మరమ్మతులకు ఏటేటా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. అయితే గత ఎనిమిదేళ్లుగా రహదారుల నిర్వహణ కాగితాలకే పరిమితమైంది. ఆచరణలో అధ్వానంగా మారింది. నిర్వహణ లేక.. జీవితకాలం ముగిసి.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 1572 వంతెనలు దెబ్బతిన్నాయి.


ఇవి ప్రయాణాలకు సురక్షితం కాదని ఆర్‌అండ్‌బీయే చెబుతోంది. తాత్కాలిక మరమ్మతులతో కూడా వాటిని కొనసాగించలేమని తేల్చింది. ఇక అత్యంత ప్రమాదకర పరిస్థితిలో.. అంటే కూలిపోవడానికి 520 వరకు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ తరహా లెక్కలను చూపి న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) కింద రహదారి వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టును 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్‌డీబీ నుంచి రుణం తీసుకుని పనులు చేపట్టారు. తర్వాత జగన్‌ ప్రభుత్వం వచ్చింది. కట్‌ చేస్తే.. ఏడేళ్ల తర్వాత కూడా వంతెనల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. మరోవైపు ఏటేటా దెబ్బతింటున్న వంతెనల సంఖ్య పెరిగిపోతోంది. రహదారిపై ఉండే చిన్న కల్వర్టు పనిచేయకపోతేనే దాని పునర్నిర్మాణానికి డబ్బుతోపాటు బాగా సమయం తీసుకుంటోంది. అదే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే మరింత వ్యయమవుతుంది. పైగా ఐదేళ్ల క్రితమే పనికిరాదని తేల్చిన ఓ వంతెన నిర్మాణానికి నాడు రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అదే బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లకుపైనే వ్యయమవుతుందని ఆర్‌అండ్‌బీ వర్గాలే చెబుతున్నాయి. ఇలా ఏడేళ్లుగా నిర్మించకుండా పెండింగ్‌లో పెట్టినందుకు వంతెనల నిర్మాణ వ్యయం భారీగా 2533 కోట్లకు పెరిగిందని అంటున్నాయి.

Updated Date - Jun 27 , 2026 | 04:03 AM