Share News

హజ్‌ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:35 AM

రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారి కోసం కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి శని, ఆదివారాల్లో రెండు విడతల్లో...

హజ్‌ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

  • నేడు, రేపు హజ్‌కు బయల్దేరుతున్న యాత్రికులు

  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఫరూక్‌

గన్నవరం, అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారి కోసం కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి శని, ఆదివారాల్లో రెండు విడతల్లో 333 మంది హజ్‌ యాత్రకు బయల్దేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హజ్‌ యాత్రకు వెళ్తున్న వారంతా ఒకరోజు ముందుగానే గన్నవరం సమీపంలోని ఎస్‌ఎం కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. వారికోసం మైనారిటీ మంత్రిత్వ శాఖ, హజ్‌ కమిటీ... వసతి, భోజన ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది ఏపీ నుంచి 2000 మందికిపైగా హజ్‌ యాత్రకు బయల్దేరుతున్నారని పేర్కొన్నారు. విజయవాడ నుంచి ఈ నెల 18న తొలి విడతలో 156 మంది, 19న రెండో విడతలో 177 మంది వెళ్తున్నారని తెలిపారు. మిగిలిన వారు హైదరాబాద్‌, బెంగళూరు ఎంబార్కేషన్‌ కేంద్రాల నుంచి బయల్దేరుతారన్నారు. విజయవాడ కేంద్రం నుంచి హజ్‌కు వెళ్లి వచ్చే వారందరికీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు.

హజ్‌ యాత్రికులకు రూ.6.40 కోట్లు

హజ్‌ యాత్రికులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6.40 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Apr 18 , 2026 | 03:35 AM