కీలక ఫైళ్లు గల్లంతు
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:38 AM
గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. సిట్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
జగన్ జమానా గ్రూప్-1 అక్రమాల్లో కొత్త కోణం
చైర్మన్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు చేపట్టాక
మెయిన్స్ రాత పరీక్షలకు మూడోసారి మూల్యాంకనం
తీర్మానం, ప్రొసీడింగ్స్, నోట్ ఫైల్, పరిపాలనా ఉత్తర్వు,
పరిపాలనా ఆమోదం ఏవీ సిట్‌కు లభించలేదు
పీఎ్‌సఆర్ ఆధ్వర్యంలోని రెండోదశ మూల్యాంకనంలో
‘హాయ్‌ల్యాండ్’ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం
49 వేల డూప్లికేట్ ‘బార్‌కోడ్ స్లిప్‌లు’ ముద్రణ
‘మూడోదశ’లో అభ్యర్థుల జాతకాలు తారుమారు
95 శాతం మంది పత్రాల్లో మార్కుల దిద్దుబాటు
అనుమతి లేకుండా స్ర్టాంగ్‌రూమ్ తెరిచిన వైనం
సిట్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి
అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ప్రక్రియలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. సిట్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. కీలక ఫైళ్లు గల్లంతైనట్టు సిట్ గుర్తించిం ది. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించి మూడోసారి మూల్యాంకనం చేయించాలని నిర్ణయించారు. అయితే ఇందు కు సంబంధించిన తీర్మానం, ప్రొసీడింగ్స్, నోట్ ఫైల్, పరిపాలనా ఉత్తర్వు, పరిపాలనా ఆమోదం లాంటివి ఏవీ సిట్‌కు లభించలేదు. అసలు మూడోసారి మూల్యాంకనం చేయించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే దాన్ని సమర్థించుకునే అంశం కమిషన్‌లో లేదు. అప్పటి కార్యదర్శి పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో హాయ్‌ల్యాండ్‌లో జరిగిన రెండోదశ మూల్యాంకనంలో అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 49 వేల బార్‌కోడ్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్‌లను డూప్లికేట్‌వి తిరిగి ప్రింట్ చేయించారు. విజయవాడలో జరిగిన తుది దశ మూల్యాంకనం వల్ల ఎంతోమంది అభ్యర్థులు నష్టపోయారు. కొందరికి అసాధారణ లబ్ధి చేకూరింది. మరోవైపు ఇంటర్వ్యూల్లోనూ అసాధారణంగా మార్కులు వేశారు. మొదటి దశలో జరిగిన డిజిటల్ మూల్యాంకనం, తర్వాత రెండో దశ హాయ్‌ల్యాండ్ మూల్యాం కనాల్లో అనేక అక్రమాలు జరిగినా వాటి ఫలితాల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దీంతో నియామకాల్లో అభ్యర్థులకు ప్రత్యక్ష నష్టం జరగలేదు. కానీ తుది దశ అయిన మూడోసారి మూల్యాంకనం ఆధారంగానే 165 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వారిలో కొందరికి అసాధారణ మేలు జరిగిందని సిట్ నివేదికతో తేలుతోంది.
అడ్డగోలుగా ‘దిద్దుడు’
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మూడో దశ మూల్యాంకనంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. జవాబు పత్రాలను ఇష్టానుసారం దిద్దేశారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలించగా 95శాతం మంది పత్రాల్లో దిద్దుబాట్లు, రాసినదానిపై మళ్లీ రాయడం(ఓవర్ రైటింగ్) కనిపించాయి.
21 ఓఎంఆర్ స్లిప్పులపై ఎగ్జామినర్ సంతకం లేకుండా దిద్దుబాట్లు జరిగాయి. అలాగే కొన్నిచోట్ల సంతకాలు ఉన్నప్పటికీ ఎగ్జామినర్ల వాస్తవ సంతకాలతో అవి సరిపోలలేదు.
కొన్ని ఓఎంఆర్ స్లిప్పుల్లో దిద్దుబాట్లకు వేరే ఇంకు పెన్నులు వినియోగించారు.
చీఫ్ ఎగ్జామినర్లకు దిద్దుబాటు చేసే అధికారం ఉండదు. ఎగ్జామినర్ల ద్వారా మాత్రమే మార్పులు ఉంటే చేయించాలి. కానీ అనేక పత్రాల్లో నేరుగా చీఫ్ ఎగ్జామినర్లే మార్పులు చేసేశారు.
మార్పులూ.. సవరణలూ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మూడో దశ మూల్యాంకనంలో కమిషన్ ఇచ్చిన పెన్నులు కాకుండా ఇతర ఇంకు పెన్నులతో జవాబు పత్రాల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఫోరెన్సిక్ పరిశీలనలో 57 చోట్ల సంతకాలు సరిపోలలేదు.
ఒక అభ్యర్థి ఓఎంఆర్ స్లిప్‌లో నాలుగు ప్రశ్నలకు సంబంధించి 7 చోట్ల మార్పులు చేశారు. చివరికి తుది మార్కుల్లో సవరణలు జరిగాయి. ఎగ్జామినర్ సంతకాలు సరిపోలలేదు. మార్పులకు ఇతర ఇంకు పెన్ను వినియోగించారు.
ఓ అభ్యర్థి జవాబు పత్రంలో ఆరు ప్రశ్నలకు సంబంధించి 10 మార్పులు చేశారు. మూడు వరుసల్లో మార్పులు జరిగాయి. గ్రాండ్ టోటల్‌లోనూ సవరణ చేశారు. ఎగ్జామినర్ల సంతకాలు సరిపోలలేదు.
ఓ అభ్యర్థి జవాబుపత్రంలో పది ప్రశ్నలకు 14 మార్పులు చేశారు. మూడు వరుసల్లో సవరణలు చేశారు. ఎగ్జామినర్ల సంతకాలు సరిపోలలేదు.
మొత్తంగా ఇస్టానుసారం దిద్దుడు చర్యలతో 35 మంది అభ్యర్థులకు మార్కులు పెరిగాయి. 33 మందికి తగ్గాయి.
ఎగ్జామినర్ల సమాచారం లీక్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మూడోదశ మూల్యాంకనం ప్రారంభానికి ముందే 47 మంది ఎగ్జామినర్ల సమాచారం సోషల్ మీడియాలో లీకైంది. ‘మూల్యాంకనం సమయంలో తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేశారు. మూల్యాంకనం సమాచారం కోసం ప్రయత్నించారు. ఆ సమాచారం బయటకు ఇవ్వకూడదని నేను చెప్పాను. ఇలాంటి విషయాలు మాట్లాడకూడదని కాల్ కట్ చేశాను’ అని ఓ ఎగ్జామినర్ సిట్ దర్యాప్తులో వెల్లడించారు. ఇలా ముందుగానే ఎగ్జామినర్ల సమాచారం బయటకు రావడంతో వారిని అభ్యర్థులు సంప్రదించి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఎగ్జామినర్ల పేర్లు బయటికి వచ్చిన అంశంపై న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులను కూడా సిట్ విచారించింది.
అభ్యర్థే ఎగ్జామినర్
2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయిన ఓ అభ్యర్థిని ఏకంగా మెయిన్స్ పేపర్లు దిద్దేందుకు ఎగ్జామినర్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సిట్ విచారణలో గుర్తించింది. వై.వనజ అనే డిగ్రీ కాలేజీ లెక్చరర్ గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించలేకపోయారు. అనంతరం అదే నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎగ్జామినర్‌గా ఆమెను ఎంపిక చేశారు. జనరల్ ఎస్సై పత్రాల మూల్యాంకనంలో ఆమె పాల్గొన్నారు.
భద్రతా లోపాలు
మెయిన్స్ రాత పరీక్షల్లో మూల్యాంకనం తర్వాత 17 రోజుల పాటు జవాబుపత్రాలను స్ర్టాంగ్ రూమ్‌లో ఉంచారు. అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఆ ఫుటేజీని పరిశీలించగా పలు లోపాలు కనిపించాయి.
2022 ఏప్రిల్ 21 నుంచి 28 వరకు ఫుటేజీ బ్లర్‌గా ఉంది. మళ్లీ ఆ నెల 30 నుంచి మే 6 వరకు ఫుటేజీ బ్లర్ అయ్యింది.
మే 5న 7సార్లు స్ర్టాంగ్ రూమ్ తెరిచారు. ఒకసారి తెరిచినట్టుగా మాత్రమే రిజిస్టర్‌లో నమోదు చేశారు. మిగిలిన ఆరుసార్లు ఎందుకు తెరిచారో నమోదు చేయలేదు.
మే 10న నాలుగుసార్లు స్ర్టాంగ్ రూమ్ తెరిచినా నమోదు చేయలేదు.
మే 11న మూడుసార్లు తెరిచినా ఒక్కసారీ రిజిస్టర్‌లో రాయలేదు.
ఇష్టానుసారంగా ఇంటర్వ్యూలు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనంతో పాటు ఇంటర్వ్యూల్లోనూ పారదర్శకంగా వ్యవహరించలేదు. కొందరు అభ్యర్థులకు మేలు, మరికొందరికి అన్యాయం జరిగింది. ఈ వివరాలను సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇంటర్వ్యూ బోర్డుల కూర్పునకు సంబంధించిన ఆధారాలు సిట్‌కు లభించలేదు. అలాగే అభ్యర్థులను నిర్దేశించిన వరుస క్రమంలో ఇంటర్వ్యూలకు పిలవలేదు.
ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 382.5 మార్కులు సాధించిన ఎస్సీ అభ్యర్థికి ఇంటర్వ్యూలో కేవలం 41 మార్కులే వేశారు. దీంతో ఆ అభ్యర్థికి ఉద్యోగం రాలేదు.
మెయిన్స్‌లో 415.5 మార్కులు సాధించిన మరో ఎస్సీ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 46 మార్కులే వేశారు. దీంతో ఉద్యోగం రాలేదు.
422.5 మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 46మార్కులు వేయడంతో ఉద్యోగం రాలేదు.
446 మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 46 మార్కులే వేయడంతో ఉద్యోగం రాలేదు.
404 మార్కులు సాధించిన బీసీ-డీ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 50 మార్కులు వేయగా, ఉద్యోగం రాలేదు.
ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 225.5 మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి ఇంటర్వ్యూలో 67.5 మార్కులు వేశారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా ఉద్యోగం లభించింది.
మెయిన్స్‌లో 398 మార్కులు వచ్చిన మరో అభ్యర్థికి ఇంటర్వ్యూలో 72.5 మార్కులు వేశారు. ఎంపీడీవో ఉద్యోగం వచ్చింది.
392 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 72 మార్కులు వేశారు. ఎంపీడీవో ఉద్యోగం వచ్చింది.
400 మార్కులు వచ్చిన మరో అభ్యర్థికి ఇంటర్వ్యూలో 72.5 మార్కులు వేశారు. ఎక్సైజ్‌లో ఏఈఎస్ ఉద్యోగం వచ్చింది.